ఒంగోలు టౌన్: రోడ్డు ప్రమాదం జరిగి 30 గంటలు దాటుతున్నా బాధితులను పట్టించుకున్న నాథుడే లేడు. ఆకలిదప్పులతో మార్చురీ గది బయట రోదిస్తున్నా కనీసం ఓదార్చే దిక్కే లేకుండా పోయింది. బిడ్డను కోల్పోయిన తల్లి, తల్లిని కోల్పోయిన పసిపిల్లలు, భార్యను కోల్పోయిన దివ్యాంగుడైన భర్త.. ఇలా ప్రతి ఒక్కరి రోదనలు మిన్నంటుతున్నా ధైర్యం చెప్పేందుకు ఒక్క అధికారి కూడా ముందుకు రాలేదు. దీంతో కడుపుమండిన బాధితులు, బంధువులు తమకు న్యాయం చేయాలంటూ బుధవారం సాయంత్రం ఒంగోలు జీజీహెచ్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. నిందితుడిని అధికార పార్టీ నాయకులు రక్షించే ప్రయత్నం చేస్తున్నారని, అతడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం నుంచి ఒంగోలుకు వేగంగా వస్తున్న షిఫ్ట్ కారు నగరంలోని దక్షిణ బైపాస్‌లో వర్మ హోటల్ సమీపంలో బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన నిల్చున్న మహిళలను ఢీకొట్టి, అక్కడి నుంచి ఆగకుండా దూసుకెళ్లి మరో మోటారు బైకును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పాదచారి బుజ్జిబాయి (50), బైకుపై వెళ్తున్న కవిల సజన (20) మరణించారు. సజన చెల్లెలు ఉజ్వలకు పక్కటెముకలు విరిగి, లివర్ దెబ్బతినడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు.
నిందితుడిని రక్షించే యత్నం
నిందితుడు మద్యం మత్తులో కారు నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతను ఒక టీడీపీ ప్రజాప్రతినిధికి సమీప బంధువు కావడంతో పాటు రాష్ట్ర మంత్రితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అందుకే పోలీసులు కేసును నీరుగార్చి, అతడిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని కవిల సజన తల్లి కోటేశ్వరి కన్నీరుమున్నీరయ్యారు. తన చిన్న కూతురు చావుబతుకుల్లో ఉందని, సజన ఇద్దరు కుమార్తెల బాధ్యత ఎవరు తీసుకుంటారని ఆమె రోదించారు. పల్నాడు జిల్లాకు చెందిన బుజ్జిబాయి భర్త వెంకటేశ్వర్లు దివ్యాంగుడు. బుజ్జిబాయి సంపాదనతోనే ఆ కుటుంబం గడుస్తోంది. ఆమె మరణంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ప్రమాదం జరిగి రెండు రోజులైనా కేసు నమోదు చేయకపోవడం, పోస్టుమార్టం నిర్వహించకపోవడంపై ఆమె సోదరుడు వెంకటేశ్వర్లు నాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
మధ్యవర్తులతో రాజీ యత్నాలు
సజన మరణ వార్త తెలిసి చౌటపాలెం నుంచి తరలివచ్చిన గ్రామస్తులు, గిరిజన ప్రజా సమాఖ్య జిల్లా అధ్యక్షుడు రామావత్ సైదా నాయక్ ఆధ్వర్యంలో ధర్నాలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఒక టీడీపీ నేత రంగ ప్రవేశం చేసి, శ్రీరోడ్డెక్కితే లాభం లేదు, కూర్చుని మాట్లాడుకుందాంశ్రీ అంటూ రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ నేత బాధితులను జీజీహెచ్ లోపలికి తీసుకెళ్లి పంచాయితీ పెట్టడంతో మూడు గంటల పాటు కొనసాగిన ఆందోళన ముగిసింది. ఇదిలా ఉండగా సీపీఎం నాయకులు చీకటి శ్రీనివాసరావు, ఎస్డీ హుసేన్, తంబి శ్రీనివాసులు, మహేష్ తదితరులు బాధితులను పరామర్శించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబ సభ్యుల డిమాండ్
న్యాయం చేయాలంటూ జీజీహెచ్ ఎదుట మెరుపు ధర్నా
నిందితుడు అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతోనే కేసు నమోదు చేయలేదని ఆగ్రహం
మూడు గంటల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్
ఇద్దరు మహిళలు మరణించినా కనీసం పరామర్శించని ప్రజాప్రతినిధులు
టీడీపీ అనుకూల మధ్యవర్తుల ద్వారా రాజీ యత్నాలు


