జె.పంగులూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని జాతీయ రహదారిపై అలవలపాడు డొంక వద్ద మంగళవారం జరిగింది. పోలీసుల వివరాలు మేరకు..గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వెంపాడు గ్రామానికి చెందిన నాగమల్లేశ్వరి (65) తన అమ్మ స్వగ్రామం కృష్ణాజిల్లా నూజివీడు నుంచి బాపట్ల జిల్లా మార్టూరు మండల కోలలపూడి గ్రామంలో ఉన్న తన కుమార్తె రత్నకుమారిని చూసేందుకు మరో వ్యక్తి సాయంతో సోమవారం రాత్రి బయలుదేరారు. మంగళవారం ఉదయం కొలలపూడి వద్ద దిగాల్సి ఉండగా నిద్రమత్తులో ఆదమరిచి అద్దంకి మండలం వెంకటాపురం వద్ద దిగారు.
కొలలపూడి వేళ్లేందుకు ఆటో తీసుకొని వస్తానని సహాయంగా వచ్చిన వ్యక్తి కందుకూరి సుంఖాలు వెంకటాపురం వెళ్లగా మతి స్థిమితం లేని నాగమల్లేశ్వరి రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళుతుండగా అలవలపాడు డొండ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


