దర్శి: పట్టణంలోని పొదిలిరోడ్డు ఎస్‌కేజే పవర్ ప్రాజెక్ట్ సమీపంలో సాగర్‌కాలువలో మృతదేహం లభ్యమైంది. మృతదేహం ఉల్లగల్లు గ్రామానికి చెందిన చీమకుర్తి పీరుసాహెబ్(65)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పీరుసాహెబ్‌కు ఇటీవల ప్రమాదంలో గాయపడి మతిస్థిమితం లేనట్లు సమాచారం. మతిస్థిమితం లేక కాలువలో పడి మృతి చెందినట్లు తెలుస్తోంది.
పీసీపల్లి: మండల పరిధిలోని తురకపల్లి గ్రామంలో అక్రమంగా అటవీ పోరంబోకు, అటవీ భూముల్లో, బంజారా భూముల్లో అక్రమంగా తెల్లరాయి తవ్వుతున్నారన్న సమాచారంతో మైనింగ్ శాఖ ఏడీ రవిప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం దాడులు చేశారు. దాడుల్లో అక్రమంగా తెల్లరాయి తవ్వుతున్న జేసీబీనీ, 100 టన్నుల తెల్లరాయిని సీజ్ చేసినట్లు తెలిపారు. మురుగమ్మి, అయినకోట, పెదయిర్లపాడు, లక్ష్మక్కపల్లి గ్రామాల్లో కొంత మంది అక్రమంగా తెల్లరాయి తరలిస్తున్నారని తెలిసింది, వారిని కూడా కట్టడి చేస్తామన్నారు. అనుమతులు లేకుండా తెల్లరాయి తవ్వితే చర్యలు తీసుకుంటామన్నారు. దాడుల్లో ఏజీ పోల్‌రెడ్డి, ఆర్‌ఐ బాలరాజు, మాధవరెడ్డి, వీఆర్‌ఓ సుకుమార్ పాల్గొన్నారు
ఒంగోలు టౌన్ : పామూరు సీఐ మాకినేని శ్రీనివాస రావుపై వేటు పడింది. ఆయన్ను గుంటూరు రేంజ్ వీఆర్‌కు పంపిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కనిగిరి సీఐ ఉప్పు శ్రీనివాసరావుకు ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. 5 నెలల క్రితం సీఐగా బాధ్యతలు చేపట్టిన ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా ఇంటివద్ద దుకాణం తెరిచి సెటిల్మెంట్లు చేస్తున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే ఉగ్రనరసింహరెడ్డి కూడా సీఐ పట్ల అసంతృప్తిగా వున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో సీఐని వీఆర్‌కు పంపించినట్లు తెలుస్తుం .
ఒంగోలు టౌన్: జీవన శైలిలో తగిన మార్పులు చేర్పులు చేసుకోవడం వలన సగం వ్యాధులు దూరమవుతాయని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ జయప్రకాష్ చెప్పారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని ఓ ప్రైవేటు స్కూలులో ఆరోగ్య పరిరక్షణ అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్‌టీ వెంకటేశన్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో జయప్రకాష్ మాట్లాడుతూ ప్రస్తుతం 30 శాతం ప్రజలు బీపీ, షుగర్, శ్వాసకోశ వ్యాధులు, గుండెజబ్బులతో బాధపడుతున్నారని తెలిపారు. కంటినిండా నిద్ర, సరిపడా వ్యాయామం, మానసిక ఒత్తిడి వలన ఈ జీవనశైలి వ్యాధులు ప్రబలుతున్నాయని చెప్పారు. ఎవరికి వారు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవించాలని కోరారు. జేవీవీ జిల్లా కోశాధికారి బి.తిరుపతయ్య మాట్లాడుతూ చిన్నారులు అధిక చక్కెర కలిగిన పదార్థాలు, జంక్‌ఫుడ్ తినడం వలన ఊబకాయానికి గురవుతున్నారని వివరించారు. ఈ సందర్భంగా జీవన శైలి ఆరోగ్య సమస్యలు–శాసీ్త్రయ అవగాహన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్కూలు డైరక్టర్ బి.విజయలక్ష్మి, ఉపాధ్యాయులు కోటేశ్వరరావు, శివప్రసాద్, కళ్యాణ్, స్వామిదాసు, అశోక్ రెడ్డి పాల్గొన్నారు.


