పంట చేతికందే వేళ..
యర్రగొండపాలెం:
ప్రకృతి వైపరీత్యానికి మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. సోమవారం సాయంత్రం ఆకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. అకాల వర్షానికి పుల్లలచెరువు మండలంలోని కొమరోలు, యండ్రపల్లి గ్రామాల్లో వేసిన మొక్కజొన్న పంట నేలవాలి సుమారు రూ.10లక్షల మేర రైతులు రైతులు నష్టపోయారు. యర్రగొండపాలెం వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని పుల్లలచెరువు, త్రిపురాంతకం, పెద్దదోర్నాల, యర్రగొండపాలెం మండలాల్లో దాదాపు 15,773 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. అయితే ఆకస్మాత్తుగా వర్షం కురవడంతో రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. దీంతో కోతకు వచ్చిన మొక్కజొన్న పంట పొలంలోనే నేలవాలింది. కొన్ని ప్రాంతాల్లో ఆరబెట్టుకున్న కంకులు పూర్తిగా తడిచిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. దాదాపు 10 రోజుల తరువాత కోయాల్సిన మొక్కజొన్న కంకులు నేలవాలిన పంటనుంచి కోసుకోవాల్సి వచ్చిందని రైతులు వాపోయారు. దీని వల్ల బరువు తగ్గడంతో పాటు ధర కూడా పడిపోయే పరిస్థితి ఉందని రైతులంటున్నారు. వ్యవసాయాధికారులు వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
అకాల వర్షానికి కుదేలైన మొక్కజొన్న రైతులు
నేలవాలిన మొక్కజొన్న కంకులు
తడిసిపోయిన ఆరబెట్టుకున్న కంకులు
పుల్లలచెరువు మండలంలోని రెండు గ్రామాల్లోనే రూ.10లక్షల నష్టం
స్పందించని వ్యవసాయాధికారులు
నష్టపరిహారం ఇవ్వాలని రైతుల వేడుకోలు


