పోతురాజు కాలువను అభివృద్ధి చేయాలి | - | Sakshi
Sakshi News home page

పోతురాజు కాలువను అభివృద్ధి చేయాలి

Apr 8 2026 7:38 AM | Updated on Apr 8 2026 7:38 AM

ఒంగోలు టౌన్‌: నగరంలో దోమల ఉత్పత్తి కేంద్రంగా మారిన పోతురాజు కాలువను యుద్ధప్రతిపాదికన అభివృద్ధి చేయాలని, కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి షేక్‌ మాబు డిమాండ్‌ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా పోరుయాత్రను మంగళవారం స్థానిక భగత్‌సింగ్‌ కాలనీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాబు మాట్లాడుతూ...స్మార్ట్‌ సిటీ, గ్రీన్‌ సిటీ పేర్లతో నగరం అభివృద్ధిలో వెలిగిపోతున్నట్లు పాలకులు చేస్తున్న ప్రచారం క్షేత్రస్థాయిలో కాగడా వేసి వెతికినా కనిపించడంలేదని విమర్శించారు. నగరంలో పోతురాజు కాలువకు ఆనుకొని జీవిస్తున్న ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారని, కాలువలో చెత్తా చెదారం పేరుకొని పోవడంతో మురుగునీరు నిలిచిపోయిందన్నారు. దీంతో దుర్గంధం వెలువడుతుందని, దోమలు విపరీతంగా పెరిగిపోయి జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని చెప్పారు. పోతురాజు కాలువ చుట్టూ కాంక్రీట్‌ గోడలు నిర్మించాలని, కాలువను శుభ్రం చేసి మురుగునీరు పారేందుకు అనువైన చర్యలు చేపట్టాలని కోరారు. సీపీఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ...భగత్‌సింగ్‌ కాలనీ, గోపాల్‌ నగరం, మహేద్ర నగర్‌, నీలంపాలెం, కరుణా కాలనీ ప్రాంతాల్లో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మురుగు నీరు తొలగించి దోమల మందు పిచికారి చేసేవారు కూడా లేకుండా పోవడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వం ఒక్కొక్కరికి సెంటు స్థలం చొప్పున కేటాయిస్తూ భరోసా పత్రాలు జారీ చేసిందని, ఆ స్థలాలకు పొజిషన్‌ చూపించకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేయడం మంచిది కాదన్నారు. నగరంలోని శివారు ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 13న నిర్వహించే ధర్నాలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విజయలక్ష్మి, విజయమ్మ, భావనారాయణ, శ్యాము, హుసేన్‌, వీరాస్వామి, వెంకటరావు, రామకృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement