దర్శి: బెట్టింగ్‌లకు దిగి జీవితాలు నాశనం చేసుకోద్దని డీఎస్పీ లక్ష్మీనారాయణ సూచించారు. ఇటీవల గుర్తించిన 18 మంది బెట్టింగ్‌రాయుళ్లకు స్థానిక సర్కిల్ కార్యాలయంలో మంగళవారం కౌన్సెలింగ్ ఇచ్చారు. వారి కుటుంబసభ్యులను పిలిచి వారితో మాట్లాడి బెట్టింగ్ వల్ల కలిగే నష్టాలను వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. దర్శి ఏరియాలో ఒక రూంను అద్దెకు తీసుకుని క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడిన ముఖ్యమైన ఆరుగురిని అరెస్ట్ చేసి జైలుకి పంపామన్నారు. ఇప్పటి వరకు మొత్తం 26 మందిని నిందితులుగా చేర్చామన్నారు. అందులో పేద కుటుంబాలకు చెందిన తెలియక అవగాహన లేని బెట్టింగ్‌లకు పాల్పడిన కొందరిని ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు వారిని మొదటి తప్పు కింద వదిలి పెడుతున్నామని చెప్పారు.
మళ్లీ బెట్టింగ్‌లకు పాల్పడినట్లు తెలిస్తే జైలుకు పంపుతామని హెచ్చరించారు. బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాలో ముఖ్యమైన ముగ్గురు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వారిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. ఐపీఎల్‌లో ఎవ్వరూ బెట్టింగ్‌ల జోలికి వెళ్లకుండా ఉండాలన్న ఉద్దేశంతో ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలిస్తే తమ దృష్టికి తీసుకురావాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. కార్యక్రమంలో సీఐ రామారావు పాల్గొన్నారు.
18 మంది బెట్టింగ్‌రాయుళ్లకు డీఎస్పీ కౌన్సెలింగ్
ముఖ్యమైన ముగ్గురు కోసం గాలిస్తున్నాం
ఐపీఎల్‌లో బెట్టింగ్‌లు పెట్టవద్దని హెచ్చరిక
మొదటి తప్పుగా కొందరిని వదిలేశాం
రెండోసారి బెట్టింగ్‌లు పెడితే జైలుకు పంపుతాం


