అందని భరోసా
చంద్రబాబు ప్రభుత్వంలో రాని కొత్త పింఛన్లు ఏడాదిన్నరగా అర్హుల ఎదురుచూపులు దరఖాస్తు చేసుకునేందుకు కూడా అందుబాటులో లేని సైట్ భరోసా లేక ఉసూరుమంటున్న వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు ‘మీ కోసం’లో అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం
దక్కని పింఛన్..
పింఛన్ ఇప్పించాలంటూ మార్కాపురం కలెక్టర్ ‘మీకోసం’ కార్యక్రమానికి వచ్చిన దివ్యాంగులు
మార్కాపురం టౌన్:
చంద్రబాబు ప్రభుత్వంలో పండుటాకులకు కడగండ్లు తప్పడం లేదు. అర్హత ఉన్నా పింఛన్‌కు నోచుకోక నానా అవస్థలు పడుతున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఇలా ఎవరైనా పింఛను కావాలంటే సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకున్న వెంటనే వారి అర్హతను బట్టి మంజూరు చేసి మరుసటి నెల నుంచి పింఛనును ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చేవారు. దీంతో పింఛను కోసం పోరాటాలు, ఆరాటాలు, ఎదురుచూపులు ఉండేవి కావు. వలంటీరు వద్దకు వెళ్లి ఆధార్‌కార్డు ఇస్తే అర్హులై ఉంటే ఎవరి రెకమెండేషన్ లేకుండా నేరుగా పింఛను వచ్చేది. కానీ నేడు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటై సుమారు 20 నెలలు కావస్తున్నా కొత్త పింఛన్లు మంజూరు కాకపోవడంతో అర్హులైన వారు ప్రతి నెలా ఎదురు చూడటంతోనే సరిపోతోంది. ఈ ఏడాది జనవరి 1 నుంచైనా తమకు పింఛన్లు మంజూరవుతాయని ఎదురుచూపులు చూసిన వృద్ధులకు నిరాశే మిగిలింది. ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా పింఛన్లు ఇస్తారని ఆశతో ఉన్న వారు ఈ నెల కూడా అర్హుల జాబితాలో తమకు స్థానం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయంలో కనీసం దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. ఇలా ప్రతి గ్రామంలో అర్హులైన వారు చాలా మంది ప్రతి నెలా 1వ తేదీన తమకు పింఛను వస్తుందని ఆశతో ఎదురుచూడటం, రాలేదని నిరాశచెందడం 20 నెలలుగా జరుగుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే అర్హత పొంది ఉంటే ఈ తిప్పలు తప్పేవని అంటున్నారు. పింఛను కోసం ఇన్ని అవస్థలు పడాల్సి వస్తుందని తాము అనుకోలేదని వాపోతున్నారు. నెలనెలా రూ.4 వేల పింఛనుతో వ్యక్తిగత మందులు, ట్యాబెట్లు కొనుగోలు చేస్తామని, కుటుంబ సభ్యులపై ఆధారపడే బాధ ఉండదని భావిస్తే ప్రతి నెలా పింఛను మాత్రం వెనక్కుపోతోందని పలువురు వృద్ధులు ఆవేదనతో తెలిపారు. సచివాలయాలకు వెళ్లి అడిగితే ఎప్పుడొస్తాయో కూడా చెప్పలేమని అంటున్నారన్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా (అద్దంకి, కందుకూరు మినహాయించి) 715 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో మొత్తం పింఛనుదారులు 2,82,576 మంది ఉన్నారు. వీరిలో వృద్ధాప్య పింఛన్లు 1,45,690 మంది, వితంతువు పింఛన్లు 75,168 మంది, దివ్యాంగులు 32,580 మంది, ఒంటరి మహిళలు 7,692 మంది, డప్పు కళాకారులు 4,496, మత్య్సకారులు 2,446 మంది, సాంప్రదాయ చెప్పులుకుట్టే వారు 5,224 మంది, చేనేత 1712, టుడే టాపర్స్ 241, ట్రాన్స్‌జెండర్ 89, కళాకారులు 56, అభయ హస్తం 4654 మంది, అమరావతి లాండ్ లెస్ పూర్ 5, సీకేడీయూ గవర్నమెంటు 228, సీకేడీయూ ప్రైవేటు 297 మంది, డీఎంహెచ్‌ఓ 1981, సైనిక వెల్ఫేర్ 17 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరు కాక అద్దంకి, కందుకూరు నియోజకవర్గాల్లో 184 సచివాలయాల పరిధిలో మరో 80,886 పింఛన్లు ఉన్నాయి.
ఏడాది దాటినా పింఛను రాలేదు
నా భర్త పేరు కోటయ్య 2023 లో మరణించాడు. నాకు ముగ్గురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వితంతు పింఛను కోసం ఏడాది క్రితం దరఖాస్తు చేసుకున్నా. ఇంత వరకూ మంజూరు కాలేదు. కుమారుడు కంభంలో ఉంటున్నాడు. నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉంటున్నాను. జీవనం కష్టంగా మారింది. కూలి పనులు చేసుకుని బతుకుతున్నాను. వయోభారం పెరగడంతో పనిచేయలేకపోతున్నాను. పింఛను వస్తే కాస్త ఆధారంగా ఉంటుందని ప్రతి నెలా ఎదురుచూస్తున్నా. ఇంతవరకూ మంజూరు కాలేదు. ఇప్పటికై నా అధికారులు దయచూపి పింఛను ఇవ్వాలని కోరుతున్నాను.
– కొంగలీటి చెన్నకృష్ణమ్మ, మొద్దులపల్లి గ్రామం, మార్కాపురం మండలం


