చెత్త శిక్షణ.. సర్వత్రా నిరసన
శిక్షణ ఇలా...
చీమకుర్తి:
వారంతా డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు. కానీ, రేడియం జాకెట్లు, చేతులకు గ్లౌజ్‌లు ధరించి గ్రీన్ అంబాసిడర్లు (పారిశుధ్య కార్మికులు)తో కలిసి వీధివీధికి, ఇంటింటికి తిరిగి చెత్త ఎలా సేకరించాలి, తడి చెత్త, పొడి చెత్తను ఎలా వేరుచేయాలో అనుభవం గడించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానిపై ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు రెండు బ్యాచ్‌లుగా విభజించి ఒక్కో బ్యాచ్‌కు మూడు రోజుల చొప్పున చెత్త సేకరణ, చెత్తను వేరు చేయడం వంటి అంశాలపై చీమకుర్తి మండలంలోని ఆర్‌ఎల్ పురం పంచాయతీలో శిక్షణ ఏర్పాటు చేసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణలో అధ్వానంగా ఉన్న చివరి 50 పంచాయతీలకు సంబంధించిన అధికారులను ఈ శిక్షణకు ఎంపిక చేసింది. ఐవీఆర్‌ఎస్ వాయిస్ కాల్స్ ద్వారా ఈ పంచాయతీల ఎంపిక జరిగింది. మీ ఇంటి నుంచి చెత్త సేకరణ జరుగుతుందా..? అవును అయితే 1 నొక్కండి, కాదు అయితే 2 నొక్కండి అంటూ ప్రభుత్వం నుంచి వాయిస్ కాల్స్ ప్రతి గ్రామ పంచాయతీలో ఆరుగురు నుంచి 15 మంది వరకు వస్తాయి. కాదు అని 2ను ఎక్కువగా నొక్కిన 50 పంచాయతీలకు సంబంధించిన అధికారులను శిక్షణకు ఎంపిక చేశారు. ఆయా పంచాయితీలలో పారిశుధ్యానికి బాధ్యత వహించే విధంగా డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్లను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నారు. పారిశుధ్యం అధ్వానంగా ఉంటే ఎందుకు పర్యవేక్షణ చేయలేదనే ఉద్దేశంతో స్వయంగా చెత్త సంపద కేంద్రం వద్ద మూడు రోజుల పాటు రెసిడెన్షియల్ ట్రైనింగ్‌లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, ప్రభుత్వ నిర్ణయంపై గెజిటెడ్ ఆఫీసర్లయిన డిప్యూటీ ఎంపీడీఓలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు సైతం నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. అధికారి హోదాలో ఉన్నవారికి చెత్త సేకరణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం, పారిశుధ్య కార్మికులతో కలిసి స్వయంగా చెత్త సేకరణలో, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంలో పాల్గొనాలని ప్రభుత్వం నిర్ణయించడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారులతో ఇలాంటి పనులు చేయించడానికి శిక్షణ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో పారిశుధ్య సిబ్బంది కొరత, అవసరమైన నిధుల విడుదల, పరికరాలు వంటివేమీ సమకూర్చకుండా పారిశుధ్య కార్మికులతో కలిసి రేడియం జాకెట్లు, గ్లౌజ్‌లు వేసుకుని చెత్త ఎలా సేకరించాలనే దానిపై అధికారులకు శిక్షణ ఇస్తే ఏం ఉపయోగమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
19 నుంచి 21 వరకు మొదటి బ్యాచ్‌కి,
22 నుంచి 24 వరకు రెండో బ్యాచ్‌కి శిక్షణ...
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రభుత్వం ఎంపిక చేసిన 50 పంచాయతీలకు సంబంధించి ఒంగోలు డివిజన్‌తో పాటు సమీపంలోని మండలాలైన చీమకుర్తి, కొండపి, మద్దిపాడు, మర్రిపూడి, ముండ్లమూరు, నాగులుప్పలపాడు, ఒంగోలు, సంతనూతలపాడు, టంగుటూరు, జరుగుమల్లి, కొమరోలు, దోర్నాల మండలాలకు చెందిన డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్లకు ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నారు. రెండో బ్యాచ్‌లో మార్కాపురం జిల్లా పరిధిలోని బేస్తవారిపేట, సీఎస్ పురం, దొనకొండ, గిద్దలూరు, హెచ్‌ఎం పాడు, కనిగిరి, కేకే మిట్ల, పామూరు, పీసీ పల్లి, పెద్దారవీడు, పొదిలి, పుల్లల చెరువు, రాచర్ల, వెలిగండ్ల, యర్రగొండపాలెం మండలాలలోని డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్లకు ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నారు.
చెత్త సేకరణపై డిప్యూటీ ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలకు నేటి నుంచి శిక్షణ
గెజిటెడ్ ఆఫీసర్లయినా సరే.. ముక్కు మూసుకుని చెత్త సేకరణ పనులు
చేయాల్సిందేనంటున్న ప్రభుత్వం
ఇంటింటికీ తిరిగి చెత్త ఎలా సేకరిస్తున్నారో శిక్షణ పొందాలని నిర్ణయం
తడి, పొడి చెత్తను స్వయంగా వేరు చేసి చెత్త సంపద కేంద్రం వద్దే బస చేయాలని ఆదేశం
ఐవీఆర్‌ఎస్ కాల్స్‌లో పారిశుధ్యం బాగలేదన్న జిల్లాలోని చివరి 50 పంచాయతీల ఎంపిక
ఈ నెల 19 నుంచి 24 వరకు ఒంగోలు, మార్కాపురం డివిజన్ల అధికారులకు శిక్షణ
పారిశుధ్య కార్మికులతో కలిసి రేడియం జాకెట్లు, గ్లౌజ్‌లు వేసుకోనున్న అధికారులు
ప్రభుత్వ తీరుపై గెజిటెడ్ ఆఫీసర్లయిన డిప్యూటీ ఎంపీడీఓల ఆగ్రహం
జీతం కావాలంటే ప్రభుత్వం చెప్పింది చేయాల్సిందేనంటున్న ఉన్నతాధికారులు
డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు ఉదయం 6 గంటలకే రేడియం జాకెట్లు, గ్లౌజులు ధరించి ఆర్‌ఎల్ పురం గ్రామంలోని వీధుల్లో ఇంటింటికి తిరిగి ఉదయం 8 గంటల వరకు చెత్త సేకరణ చేయాలి. అనంతరం అదే గ్రామంలోని చెత్త సంపద కేంద్రం వద్ద తడి చెత్త, పొడి చెత్తను ఎలా వేరు చేయాలి, దానిని వర్మీ కంపోస్ట్‌గా ఎలా మారుస్తున్నారు, వానపాములతో ఎరువుగా ఎలా మారుతుందనే దానిపై శిక్షణ పొందిన ఆర్‌పీలు, సీఆర్‌పీల వద్ద శిక్షణ పొందాలి. ఈ విధంగా ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అదే గ్రామంలో చెత్త నుంచి సంపద తయారీపై మూడు రోజుల పాటు శిక్షణ పొందాలి. అక్కడే మూడు పూటలా టిఫిన్, భోజనం చేయాల్సి ఉంటుంది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రూములలో బస చేయాలి. ఇలా మూడు రోజుల పాటు కఠిన శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఎలాంటి సెలవులు మంజూరు చేయబడవని తెలిపారు. శిక్షణకు ఎంపికై న గెజిటెడ్ ఆఫీసర్లు అయిన డిప్యూటీ ఎంపీడీఓలు తాము గెజిటెడ్ ఆఫీసర్లమనే గౌరవం కూడా లేకుండా ప్రభుత్వం నేరుగా చెత్త కేంద్రాల వద్ద బస చేయాలని చెప్పటం, అక్కడే భోజనాలు చేయాలని చెప్పడం, తామే తడి చెత్త, పొడి చెత్తను స్వయంగా వేరు చేయాలని సూచించటం బాగులేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా సేకరించిన సమాచారం ద్వారా తమ విధుల విషయంలో చెత్త నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని డీఎల్‌పీఓ ఆర్.పద్మ దృష్టికి కూడా వారు తీసుకెళ్లగా.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పాటించాల్సిందేనని, శిక్షణ సక్రమంగా జరగాలంటే రెసిడెన్షియల్ ట్రైనింగ్ తప్పనిసరని ఆమె తెలిపినట్లు సమాచారం.


