పోరాటానికి సన్నద్ధంకండి
కార్యకర్తలే బలంగా పార్టీని ముందుకు నడిపించాలి కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో కారుమూరి, బూచేపల్లి పిలుపు
ఒంగోలు సిటీ: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, దర్శి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన నిలుస్తూ వారి సమస్యలపై పోరాటానికి సన్నద్ధం కావాలని సూచించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జిల్లా విస్తృత స్థాయి (టాస్క్‌ఫోర్స్) సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అంతకుముందు రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, నాయకులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ, మండల స్థాయిల్లో పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను నాయకత్వం సీరియస్‌గా తీసుకుంటోందన్నారు. చిన్నపాటి సమస్యలైనా, పోలీస్ కేసులైనా కార్యకర్తలకు అండగా పార్టీ నిలబడుతుందని భరోసా ఇచ్చారు. ప్రజలతో నిత్యం మమేకమై ఉండే కార్యకర్తలకు భయంకానీ, ఒంటరితనమన్న భావన ఉండకూడదన్నారు.
కమిటీల నియామకాల్లో సమన్వయం తప్పనిసరి...
పార్టీ కమిటీల నియామకాల్లో ఎలాంటి గందరగోళం లేకుండా సమన్వయంతో ముందుకెళ్లాలని బూచేపల్లి సూచించారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుర్తించి తగిన ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసిన కార్యకర్తలను బూచేపల్లి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం పార్టీ క్రమశిక్షణకు, కార్యకర్తల అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇదే ఉత్సాహం ప్రజా సమస్యలపై పోరాటంలో కొనసాగాలని కోరారు. పార్టీ విస్తరణ అనేది కొద్ది మందితో సాధ్యమయ్యేది కాదని, ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే పార్టీగా వైఎస్సార్ సీపీ నిలవాలని ఆయన అన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఒంగోలు పార్లమెంట్ పార్టీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు అన్నా రాంబాబు, కె.పి.నాగార్జునరెడ్డి, కనిగిరి, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు దద్దాల నారాయణ యాదవ్, చుండూరి రవి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
పోరాటానికి సన్నద్ధంకండి
పోరాటానికి సన్నద్ధంకండి


