ఉద్యాన రైతులకు విజ్ఞాన యాత్ర
దర్శి: జిల్లా ఉద్యానవన శాఖ ద్వారా జిల్లాలోని దర్శి, పొదిలి, అద్దంకి మండలాల్లో ఉద్యాన పంటలను సాగు చేస్తున్న రైతులను చిత్తూరు జిల్లాలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కుప్పం, గ్రీన్ ఆర్బిట్ ఫార్మర్స్‌ల్లో ఆధునిక పద్ధతిలో ఉద్యాన పంటలను సాగుచేస్తున్న రైతుల తోటల సందర్శనకు ఈ నెల 20 నుంచి 22 వ తేదీ వరకు తీసుకెళ్తారని దర్శి ఉద్యానవన శాఖ అధికారి ఎం.రవి వెంకన్న బాబు తెలిపారు. రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా ఉద్యాన పంటల సాగు విధానంపై క్షేత్రస్థాయి అవగాహన కల్పిస్తామన్నారు. కూరగాయలు, పండ్ల తోటలు, పూల సాగు వంటి ఉద్యాన పంటలకు సంబంధించిన ఆధునిక సాగు పద్ధతులు, నాణ్యమైన నాటు పద్ధతులు, ఎంపిక ఎరువుల వినియోగం, నీటి నిర్వహణ, తెగుళ్లు, రోగాలు నియంత్రణ, కోత అనంతరం నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయి ప్రదర్శన ద్వారా రైతులకు శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, మార్కెట్ అవకాశాల గురించి ఈ రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. ఈ అవకాశాన్ని ఎంపిక చేసిన ఉద్యాన రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తాళ్లూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో పశ్చిమ ప్రాంత ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు రామతీర్థం రిజర్వాయర్ నుంచి రామతీర్థం జలాలను అప్పటి ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాలకు తరలించేందుకు రూ.91 కోట్లు కేటాయించారు. ఈ ఆర్‌డబ్ల్యూఎస్ స్కీం నిర్వహణకు కాంట్రాక్ట్ వర్కర్లను నియమించారు. ప్రతి నెలా సమయానికి వారి అకౌంట్లో డబ్బులు జమ చేసేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్కీమ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఐదు నెలలగా జీతాలు అందించకుండా వారి నోట్లో మట్టి కొట్టారు. దీంతో అలసిపోయిన ఆర్‌డబ్ల్యూఎస్ స్కీం కార్మికులు ఒకటై ఆదివారం రామతీర్థం రిజర్వాయర్ వద్ద ధర్నా చేపట్టారు. కాంట్రాక్టర్ టెండర్ వేస్తున్నారు కానీ జీతాలు అందించడం లేదంటున్నారు. అలాగే కాంట్రాక్టర్ల వద్ద జీతాల గురించి అడిగితే ఉన్నతాధికారులపై, ఉన్నతాధికారులు కాంట్రాక్టర్లపై ఒకరి మీద ఒకటి చెప్పుకుంటూ జీతాలు నిలిపివేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు కలెక్టర్ ను కలిసినా ఉపయోగం లేకుండా పోయిందని చెప్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి నిలిపేసిన జీతాలను వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.


