దోచుకో..దాచుకో..పంచుకో
చంద్రబాబు ప్రభుత్వం తీరిదే 18 నెలల్లో రూ.3 లక్షల కోట్ల అప్పులు రాష్ట్రంలో పరిపాలన గాలికొదిలేసిన వైనం సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వ ఆస్తులను తన బినామీలకు అప్పజెప్పేందుకే పీపీపీ విధానం వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు
ఒంగోలు సిటీ: దోచుకో..దాచుకో..పంచుకో అన్న రీతిన రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. సంపద సృష్టిస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 18 నెలల కాలంలో రూ.3 లక్షల కోట్ల అప్పులు చేశాడని ధ్వజమెత్తారు. ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేదని విమర్శించారు. జగన్‌మోహన్ రెడ్డి హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఈ ప్రభుత్వం తూట్లు పొడిచిందని ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా తన బినామీలకు అప్పజెప్పేందుకు రాష్ట్రంలో పీపీపీ విధానాన్ని అమలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. 18 ఏళ్లు నిండిన యువతులకు నెలకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చి చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని లేని పక్షంలో నెలకు రూ.3 వేలు ఇస్తామంటూ దగా చేసిందని, దీనికి ప్రభుత్వ పెద్దలందరూ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీల ఎమ్మెల్యేలు సంపాదనలో పడ్డారని ఆరోపించారు. కోడిపందేల పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడ్డారని విమర్శించారు. సంక్రాంతి సందర్భంగా కోడిపందాలే కాకుండా మూడుముక్కలాట, లోనా బయట లాంటి జూద క్రీడలను వాట్సాప్ లో ప్రచారం చేసి పిలిపించి ఆడించారని ఆరోపించారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, పోలీసు వ్యవస్థ పని చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు. కోడిపందేలు, పేకాటలే కాకుండా అశ్లీల నత్యాలు కూడా చేయిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. సంక్రాంతి సంబరాలను అపహాస్యం చేసేలా మంత్రులు కూడా అసభ్య నృత్యాలు చేయటం దారుణమన్నారు. చంద్రబాబు పాలనను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. కూటమి నేతలు వ్యవహరించిన తీరును చూసి ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కూటమి నేతలకు మహిళలంటే గౌరవం ఉందా అని జనం ప్రశ్నిస్తున్నారన్నారు. ఒకప్పుడు పేకాట ఆడాలంటే శ్రీలంక క్యాసినోలకు వెళ్లే వారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్యాసినోకు కేంద్రంగా రాష్ట్రం మారిపోయిందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రం పేకాట కేంద్రాలకు నిలయంగా ఉందని, జూద ఆంధ్రగా మారిపోయిందని ఆయన మండిపడ్డారు.
టీడీపీవే శవ రాజకీయాలు..
పల్నాడు జిల్లాలో వైఎస్సార్ సీపీ నేత సాల్మన్ హత్య జరగడం దారుణమని కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని మా పార్టీ నాయకులు చేస్తున్న ఆందోళనలు చూసి టీడీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారని, శవ రాజకీయాలు చేయటం చంద్రబాబుకు ఆయన పార్టీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్యని ధ్వజమెత్తారు. ఇప్పటికై నా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
పార్టీని మరింత బలోపేతం చేద్దాం..
జిల్లాలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ సీపీ బలోపేతమవుతుందని కారుమూరి అన్నారు. ప్రజలకి అండగా నిలుస్తూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరం కలిసికట్టుగా మరింతగా కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్, మేరుగు నాగార్జున, ఒంగోలు పార్లమెంట్ పార్టీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, బొట్ల రామారావు, వై.వెంకటేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ నాయకులు గౌతమ్ అశోక్ పాల్గొన్నారు.


