ఆటవిడుపు అడవిపాలు..!
పెద్దదోర్నాల:
రాష్ట్రంలోనే పేరొందిన ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీశైల పుణ్యక్షేత్రానికి తరలి వెళ్లే భక్తులతో మండల కేంద్రం నిరంతరం రద్దీగా ఉంటుంది. దీంతో శ్రీశైలం వెళ్లే యాత్రికులు, సందర్శకులకు నల్లమల అందాలతో పాటు, కాస్తంత ఆటవిడుపు కల్పించేందుకు రూ.లక్షలు వెచ్చించి శ్రీశైలం రహదారిలోని గణపతి చెక్‌పోస్టు వద్ద ఎడ్వంచర్ పార్కును ఏర్పాటు చేశారు. అయితే ఎంతో ఆర్భాటంగా పనులు పూర్తి చేసినా..నేటికీ ప్రారంభానికి నోచుకోని ఎడ్వంచర్ పార్కు నేడు పిచ్చిచెట్ల నడుమ అధికారుల నిర్లక్ష్యాన్ని వెక్కిరిస్తోంది.
శ్రీశైలం వెళ్లే యాత్రికులకు ఎడ్వంచర్ గేమ్‌లతో ఆహ్లాదాన్ని అందించటంతో పాటు, అటవీశాఖకు అదనపు ఆదాయాన్ని సమకూర్చవచ్చనే ఉద్దేశంతో ఈ పార్కు ఏర్పాటు చేశారు. అయితే అధికారుల ఆశలు అడియాశలుగా మిగిలిపోయాయి. నల్లమల అడవుల్లోని వన్యప్రాణులను సంరక్షించడంతో పాటు, యాత్రికులకు ఆహ్లాదాన్ని అందించేందుకు అధికారులు ఏర్పాటు చేసిన ఎడ్వంచర్ పార్కు ఏడాది క్రితమే పూర్తయింది. కానీ ఇంత వరకు ప్రారంభించలేదు. దీంతో చిల్లచెట్ల మధ్య దిష్టి బొమ్మలా మిగిలిపోయింది. పార్కు కోసం కొనుగోలు చేసిన విలువైన పరికరాలు వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ నిరుపయోగంగా మారాయి.
గణపతి చెక్‌పోస్టు వద్ద ఉన్న సువిశాల అటవీ భూముల్లో ఎడ్వంచర్ పార్కు ఏర్పాటు చేయాలని అనుకున్నదే తడవుగా అధికారులు టెండర్లు పిలిచారు. వెంటనే అటవీ భూముల్లోని పొదలు, చెట్లను తొలగించి పార్కులో బాడీ జార్బింగ్, ల్యాండ్ జార్బింగ్, జిప్ లైనర్, బంగా ట్రాంఫో లైన్, 360 డిగ్రీ సైకిల్, హ్యూమన్‌గైరోలతో కూడిన ఎడ్వంచర్ గేమ్స్‌కు సంబంధించిన పరికరాలు ఏర్పాటు చేశారు. స్థానికులు, చిన్నారులను ఆకట్టుకునేందుకు గేమ్స్‌తో పాటు, జిమ్ సౌకర్యాలతో పార్కు సిద్ధం చేశారు. వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న ఎడ్వంచర్ పార్కుతో పాటు, మండల ప్రజలకు వినియోగపడేలా ఏర్పాటు చేసిన సాధారణ పార్కు సైతం ఏడాదిగా ప్రారంభానికి నోచుకోలేదు. లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసి ఇంత నిర్లక్ష్యంగా పార్కును ఎలా వదిలేస్తారని స్థానికులు అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు. ఎడ్వంచర్ పార్కు ప్రారంభం విషయాన్ని పక్కన పెట్టిన అధికారులు, పార్కుకు సంబంధించిన ప్రకటన బోర్డులను మాత్రం నల్లమల అభయారణ్యంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం విశేషం. దీంతో ఎంతో మంది శ్రీశైలం వెళ్లే యాత్రికులు ఈ బోర్డులను చూసి ఎడ్వంచర్ పార్కు ఎక్కడ ఉందోనని కోసం స్థానికంగా ఆరా తీస్తున్నారు. కానీ తీరా ప్రారంభించకుండా వదిలేశారని తెలిసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రజాధనం లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఎడ్వంచర్ పార్కులను అటవీశాఖ అధికారులు వెంటనే ప్రారంభించాలని శ్రీఽశైలం వెల్లే యాత్రికులు, సందర్శకులు కోరుతున్నారు.
ఆటవిడుపు అడవిపాలు..!
ఆటవిడుపు అడవిపాలు..!


