మొద్దుకత్తితో దాడి
బేస్తవారిపేట: మండలంలోని పూసలపాడులో మతిస్థిమితం లేని వ్యక్తి మొద్దుకత్తితో ఒకరిపై దాడి చేసి గాయపరిచాడు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. ఎస్సీకాలనీ సమీపంలో బొగ్గు చిన్న రంగయ్య ఇంటి పక్కన స్థలం శుభ్రం చేసుకుంటున్నాడు. ఇతని ఇంటి ఎదురుగా నివాసముంటున్న మతిస్థిమితం సక్రమంగా లేని వడ్డే లాజరు మొద్దుకత్తి తీసుకుని దాడి చేశాడు. ఈ సంఘటనలో చిన్న రంగయ్య ఎడమ చెయ్యి తెగి తీవ్రంగా గాయపడ్డాడు. లాజరు తరుచూ భార్యతో గొడవపడుతున్న సమయంలో చిన్న రంగయ్య అడ్డుకుని నచ్చచెప్పేవాడు. ఈ నేపథ్యంలో దాడికి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. క్షతగాత్రున్ని ఆటోలో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం నిమిత్తం కుటుంబసభ్యులు ఒంగోలుకు తరలించారు.
● రోడ్డుపై ప్రయాణికుల అవస్థలు
పొదిలి: విజయవాడ నుంచి అనంతపురం వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు బ్రేక్‌డౌన్‌తో నగర పంచాయతీ పరిధిలోని కంభాలపాడు వద్ద శనివారం రాత్రి నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు అర్ధరాత్రి రోడ్డుపై చలికి అవస్థలు పడ్డారు. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ డబ్బులు ఇస్తే ఎవరి దారిన వారు వెళతామని డ్రైవర్‌ను డిమాండ్ చేశారు. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకుంటే తన వద్ద నగదు ఎందుకు ఉంటాయని డ్రైవర్ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లాడు. రెండు గంటలు తరువాత అదే యాజమాన్యానికి చెందిన బస్సు అనంతపురం నుంచి విజయవాడ వెళుతూ ఆగిపోయిన బస్సులోని ప్రయాణికులను పొదిలిలో చేర్చింది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా ఎవరి టికెట్ డబ్బులు వారికి యాజమాన్యం అందజేశారు. దీంతో ప్రయాణికులు ఎవరికి తోచిన రీతిలో గమ్యస్థానాలకు వెళ్లిపోయారు.
ఒంగోలు టౌన్: కుటుంబ కలహాలతో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం...మర్రిపూడి మండలం కూచిపూడి గ్రామానికి చెందిన చేగిరెడ్డి పుల్లారెడ్డి (35) ఆదివారం ఉదయం సంతనూతలపాడు మండలంలోని పేర్నమిట్ట చెరువుకట్ట వద్దకు తన ద్విచక్రవాహనంపై చేరుకున్నాడు. చెరువు కట్ట వద్ద చెట్టుకు వైరుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తాలుకా ఎస్సై హరిబాబు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కంభం: వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో వ్యక్తి తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. ఈ సంఘటన హైవే రోడ్డుపై ఆదివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. మార్కాపురం మండలం చింతకుంట్ల గ్రామానికి చెందిన ఎనిబెర ఆకాశ్ (22) ఆదివారం రాత్రి ద్విచక్రవాహనంపై కంభం వస్తున్న సమయంలో జంగంగుంట్ల – కంభం మధ్యలో వాహనం అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లగా ఆకాశ్ రోడ్డుపైన పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని 108 వాహనంలో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా మారడంతో ఒంగోలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిసింది. మార్కాపురం మండలం చింతకుంట్ల గ్రామ మాజీ సర్పంచ్ నాగయ్య కుమారుడైన ఆకాష్‌కు ఐదు నెలల క్రితం వివాహమైంది. విషయం తెలుసుకున్న ఆకాష్ కుటుంబసభ్యులు కంభం ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని బోరున విలపించారు. ఎస్సై నరసింహారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వైద్యశాలలో వివరాలు సేకరించారు.
మొద్దుకత్తితో దాడి
మొద్దుకత్తితో దాడి
మొద్దుకత్తితో దాడి


