బీజేపీ పాలనలో ప్రమాదం అంచున దేశం
ఒంగోలు టౌన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని ప్రమాదకర దిశగా నడుపుతోందని, మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టి దేశ ప్రజలను విభజించే ప్రయత్నం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. సుందరయ్య రోడ్డులోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. ప్రజలను మతం మత్తులో ఉంచి దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగ సూత్రాన్ని అమలు చేయకపోగా ఏకంగా రాజ్యాంగాన్ని విధ్వంసం చేయడానికి వెనకాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత భావాలను రెచ్చగొట్టడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను మరుగున పడేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. సీపీఎం సీనియర్ నాయకులు పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రపంచ పెట్టుబడిదారి వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని, నిరుద్యోగం, అసమానతలు తీవ్రంగా పెరిగిపోయాయని చెప్పారు. చైనా వంటి సోషలిస్టు దేశాలు ఎలాంటి సంక్షోభాలకు గురవకుండా ప్రపంచానికి ప్రత్యామ్నాయ ఆర్థిక మార్గాన్ని చూపుతున్నాయన్నారు. ప్రపంచ యువత సోషలిజం వైపు ఆకర్షితులవుతున్నారన్నది ప్రస్తుత రాజకీయ ఆర్థిక పరిస్థితికి నిదర్శనమన్నారు. మోదీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపుతోందని, దేశ సంపదను మోదీ అనుయాయులకు దోచిపెట్టడమే పరిపాలనగా కొనసాగుతోందని విమర్శించారు. వ్యవసాయ వ్యతిరేక విధానాల వలన రైతాంగం ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న బీజేపీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే మాబు, జిల్లా నాయకులు కంకణాల ఆంజనేయులు, జీవీ కొండారెడ్డి, చీకటి శ్రీనివాసరావు, ఎం.రమేష్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.


