జిల్లా విద్యాశాఖాధికారిగా రేణుక
ఒంగోలు సిటీ: జిల్లా విద్యాశాఖాధికారిగా సి.వి.రేణుక నియమితులయ్యారు. గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేస్తున్న ఆమె బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇక్కడ డీఈఓగా విధులు నిర్వహించిన ఎ.కిరణ్‌కుమార్ గతంలో పనిచేసిన బోయపాలెం డైట్ కళాశాలలో సీనియర్ లెక్చరర్‌గా వెళ్లారు.
కురిచేడు: మండలంలోని కల్లూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయుడు పీ సురేష్ ను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్ కుమార్ మంగళవారం తెలిపారు. గత నెల 21న విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన డీఈఓ ఉపాధ్యాయుడు సురేష్ ను క్రమశిక్షణ చర్యల కింద విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సింగరాయకొండ: విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలపై మండలంలోని పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు సీహెచ్ మాధవరావును సస్పెండ్ చేసినట్లు డీఈఓ కిరణ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారని ఈ ఆదేశాలను వెంటనే అమలు చేశామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్ తెలిపారు. గత జూలై 30వ తేదీ విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణపై పాఠశాలలో ఒంగోలు డిప్యూటీ డీఈఓ చంద్రమౌళీశ్వరరావు, జీసీడీఓ హేమలత విచారణ జరపగా సీహెచ్ మాధవరావుపై విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దీనిపై నవంబరు 21వ తేదీ మాధవరావు పై సింగరాయకొండ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు కాగా అతనికి ఎస్సై బీ మహేంద్ర నిబంధనల ప్రకారం స్టేషన్ బెయిల్ ఇచ్చారు. తరువాత మాధవరావు విధులకు హాజరవుతున్నారు. ఈ ఘటనపై తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి రావటంతో డీఈఓ ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు వేశారు.


