ప్రైవేటీకరణపై కోటి గొంతుకలతో సింహనాదం
● మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్
సింగరాయకొండ: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం విజయవంతంగా సాగిందని, కోటి గొంతుకలు ఎలుగెత్తి సంతకాలు చేయటం ద్వారా తమ నిరసనను తెలియజేశాయని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం కోటి సంతకాల కార్యక్రమంపై విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రభుత్వం విద్యావ్యవస్థకు శాపంలా మారిందన్నారు. కోటి సంతకాల సేకరణలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ప్రజా వ్యతిరేకతను తెలియజేశారని చెప్పారు. ఈ నెల 10వ తేదీ బుధవారం కందుకూరు రోడ్డు సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ర్యాలీగా ఒంగోలు పార్టీ కార్యాలయానికి ఈ సంతకాల పత్రాలు చేరుస్తామని, అక్కడి నుంచి ఈ నెల 15వ తేది ఒంగోలు లోని మినీ స్టేడియం నుంచి 7 నియోజకవర్గాల పత్రాలను మొత్తం కలిపి కలెక్టరేట్ సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.
పేదలకు అందని ద్రాక్ష పండుగా
వైద్య విద్య, వైద్యం
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం వల్ల పేద, బడుగు, బలహీన, ఆర్థికంగా వెనకబడిన ఉన్నత వర్గాల వారికి వైద్య విద్య, వైద్యం అందని ద్రాక్ష పండులా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జగనన్న 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించారని పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలను పూర్తి చేశారని, 650 పడకల ఆస్పత్రి కూడా సిద్ధమయ్యాయని, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ కాలేజీలకు 150 సీట్లు మంజూరు చేస్తే చంద్రబాబు ప్రభుత్వం వద్దని తిరస్కరించిందన్నారు. అక్టోబర్ 10న పాకలలో కోటిసంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభం కాగా ఇప్పటి వరకు మండలాల వారీగా పొన్నలూరులో 9,877, సింగరాయకొండలో 10,830, కొండపిలో 7,922, జరుగుమల్లిలో 7,350, మర్రిపూడిలో 8,465, టంగుటూరులో 12,160 కలిపి మొత్తం 56,604 సంతకాలు పూర్తయ్యాయన్నారు. బుధవారం 11 గంటలకు బయలు దేరే నాటికి లక్ష్యంగా నిర్ణయించుకున్న 60 వేల దాటి 63 వేల సంతకాలు చేసిన పత్రాలను ఒంగోలులోని పార్టి కార్యాలయంలో అందజేస్తామని వివరించారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఇంతపెద్ద ప్రజా ఉద్యమం జరగలేదన్నారు. కోటి సంతకాల సేకరణ పత్రాలన్నింటినీ సంతకం చేసిన వ్యక్తి పేరు, ఫోన్‌నంబర్, మండలం, గ్రామం పేరుతో ఆన్‌లైన్ చేస్తామని వివరించారు.
అసత్య ప్రచారం తగదు
కోటి సంతకాల సేకరణ ఒక ఉద్యమంలా చేస్తుంటే ప్రభుత్వానికి కొమ్ముకాసే పత్రికలు అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామని హెచ్చరించారు. పార్టీ ఎస్‌ఈసీ సభ్యుడు డాక్టర్ బత్తుల అశోక్‌కుమార్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మసనం వెంకట్రావు, చింతపల్లి హరిబాబు, బచ్చల కోటేశ్వరరావు, షేక్ సుల్తాన్, ఎంపీటీసీ గోళ్లమూడి అశోక్‌రెడ్డి, చుక్కా కిరణ్‌కుమార్, షేక్ కరీం, పిల్లి తిరుపతిరెడ్డి, కోమిట్ల వెంకారెడ్డి, పాకనాటి రమణారెడ్డి, చొప్పర శివ, లింగాబత్తిన నరేష్, భరత్‌రెడ్డి, రామకృష్ణ, షేక్ అబ్దుల్లా, బుజ్జమ్మ, పెరికాల సునీల్,మిరియం సుధాకర్, నాగార్జున, భాను, బత్తిన మదన మనోహరరావు, బల్లెల ప్రబాకరరెడ్డి, కాకి జయపాల్, షేక్ అల్లా, షేక్ అల్లాభక్షు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


