17న శాసనసభ అంచనాల కమిటీ రాక
ఒంగోలు సబర్బన్: రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ ఈ నెల 17వ తేదీన జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ రాజాబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 సాయంత్రం 6 గంటలకు నెల్లూరు నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి రాత్రికి ఒంగోలు చేరుకొని స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో బస చేస్తారు. 17వ తేదీ ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశమవుతారు. 2019–20, 2020–21, 2021–22 ఆర్థిక సంవత్సరాల బడ్జెట్ అంచనాలపై సమీక్షిస్తారు. అనంతరం గుంటూరుకు బయలుదేరి వెళతారని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
ఒంగోలు: కక్షిదారులు ఈనెల 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాఽధికార సంస్థ చైర్‌పర్సన్ టి.రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్‌లో రాజీకి అర్హత కలిగిన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, చెక్‌బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాదబీమా వ్యాజ్యాలు, అన్ని రకాల బ్యాంకు కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రీలిటిగేన్ స్థాయిలో కూడా కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎకై ్సజ్ కేసులు, ట్రాఫిక్ కేసులు కూడా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకుని సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారం నిమిత్తం 29 బెంచీలను ఏర్పాటుచేశామన్నారు. దీనివల్ల వేగవంతంగా కేసులు పరిష్కరించుకునే సౌలభ్యం ఉందని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బేస్తవారిపేట: మండలంలోని ఒందుట్లకు చెందిన శతాధిక వృద్ధుడు సూరం సుబ్బారెడ్డి (104) మంగళవారం మృతిచెందారు. ఇతడు మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో లా డిగ్రీ చదివారు. సోషల్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్) గా గిద్ద లూరు, బేస్తవారిపేట, మార్కాపురం, యర్రగొండపాలెంలో పనిచేశారు. ఉద్యోగ జీవితంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఎస్‌ఈఓగా పేరు నిలిచిపోయింది. 1950–52లో గుంటూరు లో విద్యనభ్యసించే సమయంలో గుంటూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు. వ్యవసాయంపై మక్కువతో గిద్దలూరు నియోజకవర్గంలో మొదటగా బత్తాయి సాగు చేశారు. మృతుడికి ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. మాజీ సీఎం భవనం వెంకట్రామిరెడ్డి, కేంద్ర మంత్రి పులి వెంకటరెడ్డిలు ఇతని క్లాస్‌మేట్స్. బుధ వారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మద్దిపాడు: డివైడర్‌ను ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి ఏడుకొండలపాడు సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. వివరాల్లోకి వెళితే.. కొరిశపాడు మండలం రావినూతల గ్రామానికి చెందిన దొప్పలపూడి నాగేశ్వరరావు(55) సోమవారం అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో ఆటోలో ఒంగోలు వైపు వెళుతూ ఏడుగుండ్లపాడు ఫ్లైఓవర్ పై డివైడర్‌ను ఢీకొట్టారు. ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో అంబున్సెలో ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


