ఏపీ టెట్ పకడ్బందీగా నిర్వహించాలి
ఒంగోలు సబర్బన్: జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పీ.రాజాబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో ఏపీ టెట్ పరీక్షల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు ఈనెల 10 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఈనెల 10 నుంచి 21వ తేదీ వరకు జిల్లాలో జరిగే టెట్ పరీక్షలకు 810 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. 8 కేంద్రాలను ఏర్పాటు చేశామని, పరీక్షలు నిర్వహించడానికి ప్రత్యేక అధికారులను కూడా నియమించినట్లు చెప్పారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండవ సెషన్ పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు. టెట్‌కు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లోకి గంట ముందుగా చేరుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లకు అనుమతి లేదని చెప్పారు. ఉదయం పూట 510 మంది, సాయంత్రం జరిగే పరీక్షలకు 300 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సంబంధిత అదికారులను ఆదేశించారు. సమావేశంలో డైట్ ప్రిన్సిపల్ ఎస్.సుబ్బారావు, డిప్యూటీ డీఈఓ చంద్రమౌళి, ఏడీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో ఏపీ టెట్ ఈ నెల 10 నుంచి 21 వరకు
అధికారులతో సమీక్షించిన కలెక్టర్ పీ.రాజా బాబు


