సురక్షితమైన తాగునీరు అందించాలి
● కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు సబర్బన్: జిల్లాలో ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. జల సురక్ష, స్కబ్ టైఫస్ జ్వరాలు, ప్రధానమంత్రి సూర్యఘర్, గృహనిర్మాణాలు, క్యాటిల్ షెడ్స్ నిర్మాణాలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై కలెక్టరేట్ నుంచి మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడానికి జలసురక్ష మాసంగా నెల రోజులు పాటు తాగునీటి పథకాలను పరిశుభ్రం చేయటం, పైప్‌లైన్లు, తాగునీటిబోర్ల మరమ్మతులుచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 856 ఓవర్ హెడ్ ట్యాంకులు ఉంటే ఇప్పటికే 500కు పైగా తాగునీటి ట్యాంకులను శుభ్రం చేశామన్నారు. మిగిలిన ట్యాంకులను నెలాఖరు లోగా శుభ్రం చేయాలని ఆదేశించారు. మండలస్థాయి అధికారులు వారంలో మూడు రోజులు పాటు గ్రామాల్లో పర్యటించాలని సూచించారు. మండలస్థాయి అధికారులు గ్రామాల్లో తిరిగి ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించే దిశగా పనిచేయాలన్నారు. జిల్లాలో స్కబ్ టైఫస్ జ్వరం గురించి ప్రజలు ఆందోళన చెందకుండా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో సూర్యఘర్ పథకం కింద సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేసిన క్యాటిల్ షెడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంజూరైన గృహ నిర్మాణాలను ఉగాది నాటికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ జోసఫ్‌కుమార్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వరరావు, గ్రామీణ నీటిసరఫరాశాఖ ఎస్‌ఈ బాల శంకరరావు తదితరులు పాల్గొన్నారు.


