చెడు అలవాట్లకు బానిసై చోరీలు
కొమరోలు: చెడు అలవాట్లకు బానిసలైన ముగ్గురు స్నేహితులు సులభంగా నగదు సంపాదించాలన్న ఉద్దేశంతో విద్యుత్ శాఖ సామగ్రి చోరీ చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో కాపర్ వైరు, అల్యూమినియం వైర్లు, విద్యుత్ స్తంభాలు చోరీ చేశారు. ఈ క్రమంలో నిఘా ఉంచి మండలంలోని నారాయపల్లె క్రాస్ రోడ్డు వద్ద నంధ్యాల జిల్లా మహానంది మండలం కొట్టాల గ్రామానికి చెందిన నిసినం ఇర్మియా, చిగుళ్ల ఆంజనేయులు, మహానందిగారి శ్రీనివాసులను అరెస్టు చేసినట్లు సీఐ జె.రామకోటయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. నిందితులు ఒకే గ్రామానికి చెందిన వారని, గతంలో వెదురు కర్రలు కొట్టుకొని జీవనం సాగించేవారని, తర్వాత చెడు అలవాట్లకు బానిసై చిన్న చిన్న దొంగతనాలు చేసేవారన్నారు. ఈ క్రమంలో 2022లో కూడా నంద్యాల జిల్లాలో పలు దొంగతనాల కేసుల్లో అరెస్టు అయి జైలుకు వెళ్లారు. మూడు నెలల నుంచి కొమరోలు, రాచర్ల మండలాల్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ లైన్లలో విద్యుత్ తీగలను దొంగతనం చేశారన్నారు. కొమరోలు మండలంలో సుమారు 152 విద్యుత్ స్తంభాలు, 11 కేవీ అల్యూమినియం కరెంటు వైరు, 7600 మీటర్ల పొడవైన వైరును దొంగిలించారన్నారు. అదే విధంగా రాచర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో 11 కేవీ అల్యూమినియం కరెంటు వైరు, సుమారు 50 విద్యుత్ స్తంభాలు, గిద్దలూరు పోలీసుస్టేషన్ పరిధిలో 30 కిలోల బరువైన కాపర్ వైరు, పెద్దారవీడు పోలీసుస్టేషన్ పరిధిలో 10 కిలోల కాపర్ వైరు, కంభం పోలీసుస్టేషన్ పరిధిలో 5 కిలోల కాపర్ వైరు చోరీకి గురైనట్లు ఆయా పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు నమోదై ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం మండలంలోని నారాయణపల్లె క్రాస్‌రోడ్డు వద్ద కొమరోలు ఎస్సై జె.నాగరాజు దొంగలను పట్టుకుని రూ.3.85 లక్షల విలువైన విద్యుత్ సామగ్రిని, నేరానికి ఉపయోగించిన ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పేర్కొన్నారు.
నంద్యాల జిల్లాకు చెందిన ముగ్గురు స్నేహితులను అరెస్టు చేసిన పోలీసులు
రూ.3.85 లక్షల విలువైన కరెంట్ సామాగ్రి స్వాధీనం


