దోచిపెట్టే వారికి మెడికల్ కాలేజీలు
పీపీపీతో చంద్రబాబు అస్మదీయులకు కట్టబెడుతున్నారు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి
యర్రగొండపాలెం: దోచుకో, దాచుకో అన్న సూత్రాన్ని వల్లెవేసే చంద్రబాబు తనకు దోచిపెట్టేవారికి మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో అప్పచెప్తున్నారని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. రచ్చ బండ–కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని, వారి బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వైద్య కళాశాలలను బహుమతిగా ఇచ్చారని, వాటిని తమ బాబు సొత్తు అన్నట్లుగా చంద్రబాబు తన అస్మదీయులకు దానం చేస్తున్నాడని మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రజలు ఎటువంటి అనారోగ్యానికి గురికాకుండా, పేద తల్లుల పిల్లలు డాక్టర్లుగా ఎదిగేందుకు రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేయించి పనులు వేగవంతం చేయించారని వారు అన్నారు. కరోనా దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటూనే రాష్ట్రంలో 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేయించగలిగారని, అందులో 5 కళాశాలలు ప్రారంభమయ్యాయని, మరో రెండు కళాశాలలు ఎన్నికల కోడ్ వలన ప్రారంభించలేక పోయారని, మిగిలిన 10 కళాశాలలు వివిధ స్థాయిలో పురోభివృద్ధిలో ఉన్నాయన్నారు. ఆయా కళాశాలల్లో ఎటా దాదాపు 20,250 మంది పేద విద్యార్థులు వైద్యులుగా ఎదిగి రాష్ట్రంలో ప్రజలకు వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో జగన్‌మోహన్‌రెడ్డి బృహత్తర ఆలోచన చేశారని అన్నారు. అటువంటి పరిస్థితులను చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండు కళాశాలలకు మంజూరైన మెడికల్ సీట్లను సైతం తమకు వద్దని వెనక్కి పంపించారన్నారు. ఆ కళాశాలల్లో వైద్యులుగా ఎదగాల్సిన 5 వేల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని వారు విమర్శించారు. చంద్రబాబు నాయుడు తన 18 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ అయిన తీసుకొచ్చాడా అని వారు ప్రశ్నించారు. పూర్తిగా వెనకబడిన పశ్చిమ ప్రాంతంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాల్లోని పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించవచ్చన్న ఉద్దేశంతో జిల్లాలో రెండో కళాశాలను మార్కాపురానికి మంజూరు చేయించి పనులు వేగవంతంగా జరిగేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. పశ్చిమ ప్రాంతాల ప్రజలు అనారోగ్యానికి గురైనా, ప్రమాదాలు జరిగినా వందల కిలో మీటర్ల దూరంలో ఉన్న గుంటూరు, ఒంగోలు, కర్నూలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, దూర ప్రయాణం వలన అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారన్నారు. మార్కాపురంలో మెడికల్ కాలేజీ ఏర్పాటైతే అటువంటి పరిస్థితి నెలకొని ఉండేది కాదని అన్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణాలకు కేటాయించిన స్థలం ప్రభుత్వానిది, నిర్మాణాలకు అయ్యే ఖర్చు ప్రభుత్వానిది, వైద్యులకు, ఇతర సిబ్బందికి ఇచ్చే జీతభత్యాలు ప్రభుత్వానిదని అటువంటప్పుడు ఆ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు అప్పచెప్తున్నారన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన దుశ్చర్యను గవర్నర్ దృష్టికి తీసుకొని వెళ్లేందుకు రచ్చబండ–కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టారని, ఈ కార్యక్రమానికి ప్రజల్లో అనూహ్య స్పందన వచ్చిందని చెప్పారు. ఎటువంటి అభివృద్ధి చూపకుండా మార్కాపురం జిల్లాగా ప్రకటించారని, దీనివలన వెనకబడిన ప్రాంతం మరింతగా వెనకబడి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దర్శి నియోజకవర్గాన్ని మార్కాపురం జిల్లాలో కలపకపోవడంతో చంద్రబాబు రాజకీయ ఎత్తుగడ అర్థమవుతుందని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, ఎంపీపీ దొంతా కిరణ్‌గౌడ్, జెడ్పీటీసీలు చేదూరి విజయభాస్కర్, వాగ్యా నాయక్, పార్టీ మండల కన్వీనర్లు ఏకుల ముసలారెడ్డి, గంట వెంకట రమణారెడ్డి, పాలిరెడ్డి కృష్ణారెడ్డి, దోమకాల వెంకటేశ్వర్లు, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుముల అరుణ, ఆదిత్య విద్యా సంస్థల అధినేత సూరె వెంకట రమేష్, వివిధ విభాగాల నాయకులు కె.ఓబులరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, ఎం.బాలగురవయ్య, ఎం.సుబ్బారెడ్డి, ఎం.ఆదిశేషు, ఆర్.అరుణాబాయి, కె.కాశీవిశ్వనాధ్, పి.శ్రీనివాసులు, డి.సంతోష్ కుమార్, పి.రాములు నాయక్, ఎ.రమణారెడ్డి, వై.శ్రీనివాసులురెడ్డి, ఎస్.ప్రసాద్, రంగనాయకులు, శార, షేక్.మహమ్మద్ కాశిం, సురేష్ నాయక్ పాల్గొన్నారు.


