ఎయిడెడ్ విద్యార్థులకు మెటీరియల్ ఇవ్వాలి
ఒంగోలు సిటీ: ఎయిడెడ్ విద్యార్థులకు మెటీరియల్ ఇవ్వకుండా ఎఫ్‌ఎల్‌ఎన్ 75 రోజుల కార్యక్రమం ఏ విధంగా నిర్వహించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకట్రావు, ప్రభాకర్‌రెడ్డిలు మంగళవారం ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం పని చేస్తున్న 80 ప్రాథమిక, 22 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదివే పేద విద్యార్థులకు మెటీరియల్ ఇవ్వకుండా గ్యారంటీ ఫౌండేషన్ లిటరసీ న్యూమరసే ప్రోగ్రాం ఎఫ్‌ఎల్‌ఎన్ ఏ విధంగా ఎయిడెడ్ పాఠశాలల్లో నిర్వహించాలని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. సర్వశిక్ష అభియాన్ అధికారులను ఎన్నిసార్లు అడిగినా ఎయిడెడ్ విద్యార్థులకు సంబంధించి ఎఫ్‌ఎల్‌ఎన్, తరల్ కిట్లు, స్పోర్ట్స్ మెటీరియల్ ఇవ్వలేదని, డిసెంబర్ 5న జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్‌కు సంబంధించిన నిధులు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కంభం: జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు మంగళవారం కంభం, బేస్తవారిపేట మండల విద్యాశాఖాధికారులు అబ్దుల్ సత్తార్, శ్రీనివాసులు, మధుసూదన్‌రెడ్డి ఎయిడెడ్ పాఠశాలలను తనిఖీ చేశారు. స్థానిక రంగరాజు ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలలో గత మూడేళ్లుగా విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, హాజరు, అడ్మిషన్లు, బదిలీ రికార్డులు తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. వసతులు, సౌకర్యాలు, క్రీడా పరికరాలు, మైదానం వాస్తవ స్థితిని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు.


