కోతకు గురైన ప్రజావారధి
● త్రిపురాంతకం–కురిచేడు మండలాలకు నిలిచిన రాకపోకలు
కురిచేడు: మోథా తుఫాన్‌తో కురుస్తున్న భారీ వర్షాలకు ముష్టి గంగవరం వద్ద గుండ్లకమ్మపై ఉన్న ప్రజావారధి కోతకు గురైంది. వారం రోజులుగా ఈ బ్రిడ్జిపై నుంచి రాకపోకలు నిలిపివేయడంతో ప్రాణనష్టం తప్పింది. భారీ వర్షాలకు గుండ్లకమ్మ వాగు పొంగి ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం ధాటికి ప్రజావారధి ముష్టి గంగవరం వైపు సుమారు 20 అడుగుల దూరం కోతకు గురైంది. దీంతో త్రిపురాంతకం, కురిచేడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రజా వారధిని చుట్టుపక్కల గ్రామస్తులు చందాలు వేసుకొని నిర్మించుకున్నారు. ప్రస్తుతం ప్రజావారధి కోతకు గురి కావడంతో చుట్టుపక్కల ఎన్నో గ్రామాల ప్రజలకు ఎంతో దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. త్రిపురాంతకం మండలం మేడపి తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ బ్రిడ్జి దూరాన్ని తగ్గించటంతోపాటు సమయాన్ని కూడా తగ్గిస్తుండటంతో ప్రతి నిత్యం వేల సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ బ్రిడ్జి ద్వారా సుమారు 20 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో నీటి ప్రవాహం తగ్గగానే ప్రభుత్వం చొరవ తీసుకొని గండిపూడ్చి రాకపోకలు పునరుద్ధరంచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


