వెలిగొండ సొరంగాల్లోకి వరద నీరు
● తీగలేరు కాలువకు గండి పడటంతో నీట మునిగిన సొరంగ నిర్మాణాలు
పెద్దదోర్నాల: మోంథా తుఫాన్ తీవ్రతతో పెద్దదోర్నాల మండలంలోని కొత్తూరు వద్ద జరుగుతున్న పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణాల్లోకి వరద నీరు ప్రవేశించింది. తుఫాన్ తీవ్రతతో నల్లమల అభయారణ్యంలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు వాగులు ఉధృత రూపం దాల్చాయి. తీగలేరు వాగు పొంగి ప్రవహించటంతో వాగుకు గండ్లు పడి వరద నీరంతా వెలుగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణాల్లోకి ప్రవహించింది. దీంతో రెండు సొరంగాలు పూర్తి స్థాయిలో నీట మునిగాయి. దీంతో సొరంగ నిర్మాణ పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద నీరు సొరంగాల్లోకి వచ్చే సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని, సొరంగాల లోపల విధులు నిర్వహించే కార్మికుల్లో కొందరిని కొల్లంవాగు ప్రాంతానికి తరలించి అనంతరం ప్రత్యేక బోటుల్లో వారిని శ్రీశైలానికి చేర్చినట్లు అధికారులు పేర్కొన్నారు. మరి కొందరు సొరంగం వెలుపలకు వచ్చి ప్రాజెక్టు క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారని సిబ్బంది పేర్కొన్నారు. సొరంగాల్లోకి ప్రవేశించిన నీటిని తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, మరో వారం రోజుల్లో నీటిని తొలగిస్తామని ఇరిగేషన్ ఎస్‌ఈ అబూతాలిం తెలిపారు.
వెలిగొండ సొరంగాల్లోకి వరద నీరు


