బుధవారం శ్రీ 29 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
కూలిన గృహాలు
మోంథా తుపానుతో జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు 12 గృహాలు, రెండు రేకుల షెడ్లు నేలమట్టమయ్యాయి. దీంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
మోంథా తుపాను జిల్లాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. గంట గంటకూ వర్ష బీభత్సం పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం నుంచి భారీగా వర్షం కురిసింది. తీరందాటే సమయానికి గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో విరుచుకుపడింది. కుంభవృష్టితో ఒంగోలు నగరం నీట మునిగింది. పలు కాలనీల్లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. ప్రధాన రోడ్లు చెరువులను తలపించాయి. జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఈదురుగాలులతో తీరప్రాంతం భయానకంగా మారింది. భారీగా అలలు ఎగసిపడుతుండడంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఆర్టీసీ 30 శాతం బస్సులను రద్దు చేసింది. పలు రైళ్లు రద్దయ్యాయి. ప్రయాణికులు రాక బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు నిర్మానుష్యంగా మారాయి. పశ్చిమ ప్రకాశంలోని పలు ప్రాంతాలు, నల్లమల అటవీ ప్రాంతంలో కూడా భారీ వర్షం కురిసింది. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా వాసులు భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటున్నారు. ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకూ పలు మండలాల్లో 10 నుంచి 16 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పర్యటించి పునరావాస ఏర్పాట్లను పర్యవేక్షించారు. భారీ వర్షాలకు సింగరాయకొండ పోలీస్ స్టేషన్, నగరంలో పోలీస్ ట్రైనింగ్ కళాశాలలు నీట మునిగాయి.
జలదిగ్బంధంలో ఒంగోలు నగరంలోని కొత్తకూరగాయల మార్కెట్
కల్లోల మోంథా..
బుధవారం శ్రీ 29 శ్రీ అక్టోబర్ శ్రీ 2025


