కన్నీటి సంద్రం! | - | Sakshi
Sakshi News home page

కన్నీటి సంద్రం!

Oct 29 2025 7:29 AM | Updated on Oct 29 2025 8:03 AM

భయం గుప్పెట్లో జిల్లా

జలమయమైన ఒంగోలు నగరం

జిల్లా అంతటా కుండపోత

మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి వరకూ భారీ వర్షం

రాత్రి ఉరుములు, మెరుపులతో కుంభవృష్టి

సముద్రంలో ఎగసిపడుతున్న అలలు...అల్లకల్లోలంగా తీర ప్రాంతం

పొంగిపొర్లుతున్న వాగులు..వంకలు

పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు

నీట మునిగిన సింగరాయకొండ పోలీస్‌స్టేషన్‌, ఒంగోలు పీటీసీ

30 శాతం బస్సు సర్వీసులు రద్దు

నల్లమలలో కుంభవృష్టి

ఒంగోలు సత్యనారాయణపురంలో ఇళ్లను చుట్టుముట్టిన వర్షం నీరు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: మోంథా తుపాను ప్రభావంతో మంగళవారం జిల్లా అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఆకాశానికి చిల్లుపడిందా అన్నరీతిలో కుంభవృష్టి కురిసింది. ఒకపక్క కుండపోత...మరోపక్క ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో జిల్లా అంతా భయం గుప్పెట్లో చిక్కుకుంది. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలలతో సాగర తీరం అల్లకల్లోలంగా మారింది. తుపాను నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో వాగులు ప్రవహిస్తున్న కొండపి, ఇంకొల్లు మండలాల్లో బస్సు సర్వీసులను రద్దు చేసినట్లు ఆర్‌ఎం సత్యనారాయణ తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా సముద్ర తీర ప్రాంతాల్లో బస్సు సర్వీసులను నిలిపేశారు. మిగతా ప్రాంతాల్లో కూడా అవసరాన్ని బట్టి బస్సులను నడిపారు. జిల్లా మొత్తం మీద 30 శాతం బస్సులను నిలిపేసినట్లు ఆయన వివరించారు. అలాగే తిరుపతి నుంచి హౌరా వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలును రద్దు చేసినట్లు ఒంగోలు రైల్వే స్టేషన్‌ మేనేజర్‌ యేసుపాదం తెలిపారు.

దాంతో పాటు ఒంగోలు నుంచి బయలుదేరే విజయవాడ ప్యాసింజర్‌ ట్రైన్‌ ను కూడా రద్దు చేసినట్లు చెప్పారు. మోంథా తుపాను ముప్పు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా అధికారుల వరకూ అందరూ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, జోనల్‌ తుపాను ప్రత్యేక అధికారి ఆర్‌పీ సిసోడియా, మరో సీనియర్‌ అధికారి కోన శశిధర్‌లో జిల్లాలోనే ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

వచ్చే 24 గంటలు అప్రమత్తత అవసరం...

జిల్లాకు వచ్చిన జోనల్‌ ప్రత్యేక అధికారి ఆర్‌పీ సిసోడియా కలెక్టరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను సందర్శించారు. కలెక్టర్‌ పీ.రాజాబాబుతో పాటు, ఎస్పీ హర్షవర్దన్‌ రాజు, జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాల కృష్ణ, డీఆర్‌ఓ సీహెచ్‌.ఓబులేసులతో పాటు ఇతర అధికారులతో సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. వచ్చే 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా తీర ప్రాంత మండలాల్లో అప్రమత్తత చాలా అవసరమని హెచ్చరించారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి కష్టాలు కలుగకుండా తగు ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మరో అధికారి సిసోడియా రాష్ట్ర మంత్రి స్వామితో కలిసి సింగరాయకొండ మండలం పాకల, ఊళ్లపాలెం గ్రామాల్లో పర్యటించారు. తుపాను బాధిత ప్రజలను ఆదుకోవటానికి పునరావాస కేంద్రాలను 36కు పెంచారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా 27 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు మంగళవారానికి 9 పునరావాస కేంద్రాలు పెంచి 36 ఏర్పాటు చేశారు. వాటిలో ఒంగోలు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 23 ఏర్పాటు చేయగా కనిగిరి రెవెన్యూ డివిజన్‌లో 13 ఏర్పాటు చేశారు.

రికార్డు స్థాయి వర్షం...

జిల్లా వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం నుంచి గంట, గంటకూ వర్షం పెరుగుతూ పోతోంది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి వర్షం జోరందుకుంది. సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి జిల్లా వ్యాప్తంగా సరాసరిన 2.22 సెంటీ మీటర్లు కురిసిన వర్షం(అంటే 24 గంటల్లో) అదే మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 4.43 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. అంటే 5 గంటల వ్యవధిలో రెట్టింపు వర్షం కురిసింది. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి భారీ వర్షం ప్రారంభమైంది. ఒంగోలు, కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో కుండపోత వర్షం కురిసింది. రాత్రి 10 గంటలకు అందిన వివరాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఒంగోలు నగరంలో 10 గంటల వ్యవధిలో 15.50 సెం.మీ వర్షం కురిసింది. అదేవిధంగా సింగరాయకొండలో 15.26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల లోపు ఇంత పెద్ద స్థాయిలో వర్షపాతం నమోదు కావటం గత పదేళ్ల కాలంలో ఇంతవరకు జరగనే లేదు. ఇంకా బుధవారం ఉదయానికి మరో ఆరు, ఏడు సెంటీమీటర్లు కంటే అధికంగా నమోదై 20 గంటల లోపే 20 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు కావచ్చని అంచనాలు వేస్తున్నారు. ప్రకాశం జిల్లా చరిత్రలోనే ఇది ఒక రికార్డుగా నమోదు కానుంది. 24 గంటల వ్యవధిలో 14 నుంచి 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తీర ప్రాంతం మండలాల్లోని టంగుటూరులో కూడా రాత్రి 10 గంటల వరకు 15.74 సెంటీమీటర్లు వర్షం కురిసింది. కొత్తపట్నంలో కూడా దాదాపు 14.36 సెం.మీ, నాగులుప్పలపాడు మండలంలో కూడా 14.58 సెంటిమీటర్లు పైగా వర్షం కురిసింది. కొండపిలో అత్యధికంగా రాత్రి 10 గంటల లోపు 16.48 సెంటీ మీటర్లు, పొన్నలూరులో 14.68 సెంటీ మీటర్లు, చీమకుర్తిలో కూడా 13 సెంటీమీటర్లు వర్షం కురిసింది. పామూరులో 11.6 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అర్ధరాత్రి కూడా భారీ వర్షం కురుస్తూనే ఉంది.

– మోంథా తుపాను ధాటికి నాగులుప్పలపాడు మండలంలో మంగళవారం రాత్రి 9 గంటల వరకు 199.6 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షం ధాటికి నాగులుప్పలపాడు నుంచి తిమ్మన్నపాలెం వెళ్లే దారిలో 3 వాగులు నిండుగా పొర్లడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చదలవాడ 216 జాతీయ రహదారిపై నీరు చేరడంతో పోలీసులు వాహనాలను దారి మళ్లించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చదలవాడ రామన్న చెరువును జాయింట్‌ కలెక్టర్‌ గోపాల కృష్ణ, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న పరిశీలించారు.

కొత్తపట్నం తీరంలో భీకర గాలులు:

కొత్తపట్నం మండలంలో మోంథా తుపాను ప్రభావంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి అతి భారీ వర్షంతో పాటు భీకర గాలులు వీచాయి. సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నాయి. సముద్రం ముందుకు వచ్చి దాదాపు రోడ్డును తాకడంతో మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. మత్స్యకారులు రెండు రోజుల క్రితమే వేట సామగ్రిని సురక్షత ప్రాంతాలకు తరలించి జాగ్రత్తలు తీసుకున్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొత్తపట్నం, ఈతముక్కల, గుండమాల, మోటుమాల, మడనూరు, కావలికి వెళ్లే ఆర్టీసీ బస్సులను మధ్యాహ్నం రద్దు చేశారు. కార్లు, ఆటోలు, లారీలు నాలుగు చక్రాల వాహనాల రాకపోకలను పూర్తిగా రద్దు చేశారు. బకింగ్‌హాం కాలువ, నల్లవాగు, ముదిగండి వాగులు ఉప్పొంగాయి. రోడ్లు అక్కడక్కడా కోతకు గురయ్యాయి. అల్లూరు, పాదర్తి ఇరిగేషన్‌ చెరువుల్లో నీరు చేరడంతో బయటకు కొంత నీటిని పంపించారు. ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని మైక్‌ ద్వారా ప్రచారం చేశారు. కె.పల్లెపాలెం గ్రామంలో సునామీ కాలనీ నీటి మునిగింది. కొత్తపట్నం గ్రామంలో గంగమ్మకాలనీ, గిరిజన కాలనీలో నీళ్లు చుట్టుముట్టాయి. అధిక వర్షానికి పంటలు నీటిపాలయ్యాయి.

కన్నీటి సంద్రం!1
1/4

కన్నీటి సంద్రం!

కన్నీటి సంద్రం!2
2/4

కన్నీటి సంద్రం!

కన్నీటి సంద్రం!3
3/4

కన్నీటి సంద్రం!

కన్నీటి సంద్రం!4
4/4

కన్నీటి సంద్రం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement