కూలిన గృహాలు | - | Sakshi
Sakshi News home page

కూలిన గృహాలు

Oct 29 2025 7:29 AM | Updated on Oct 29 2025 7:29 AM

కూలిన

కూలిన గృహాలు

యర్రగొండపాలెం : అమానుగుడిపాడులో మిద్దె కూలడంతో ధ్వంసమైన సామగ్రి

కనిగిరిలో రేకుల షెడ్‌ కూలిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న మున్సిపల్‌ అధికారులు

గిద్దలూరు : ముండ్లపాడులో పడిపోయిన రేకుల షెడ్‌

జిల్లాలో 12 గృహాలు, 2 రేకుల షెడ్లు నేలమట్టం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు మోంథా తుఫాన్‌ నేపథ్యంలో కురిసిన భారీ వర్షాలకు

జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయాయి. ముసురు, జడితోపాటు

భారీ వర్షాలకు మట్టి మిద్దెలు, పూరి గుడిసెల గోడలు నానిపోయి కూలాయి.

బేస్తవారిపేట:

మండలంలోని చెన్నుపల్లెలో ఈర్నేని కృష్ణవేణి, పోగుళ్లలో గొర్ల తిమ్మయ్య, దొర ఏడుకొండలు, దొర లక్ష్మీదేవి, దొర చిన్న వెంకటయ్యకు చెందిన పూరిగుడిసెలు పడిపోయాయి. విషయం తెలుసుకున్న మండల స్పెషల్‌ ఆఫీసర్‌ పానకాలరావు, తహసీల్దార్‌ జితేంద్రకుమార్‌, ఎంపీడీఓ రంగనాయకులు గ్రామానికి వెళ్లి గృహ యజమానులతో మాట్లాడి సమీపంలోని పాఠశాలల్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. అలాగే బాలేశ్వరపురం ప్రాథమిక పాఠశాల భవనం పైకప్పు వర్షానికి తడిసి పెచ్చులూడి కిందపడుతోంది.

గిద్దలూరు రూరల్‌: మండలంలోని ముండ్లపాడు గ్రామంలో నున్నా సుబ్బారావుకు చెందిన రేకుల షెడ్డు పడిపోయింది. తల్లం సతీష్‌కు చెందిన పాత మిద్దె కూలింది. కురుకుందు వెంకటేశ్వర్లుకు చెందిన పశువుల షెడ్డు పైకప్పు పడిపోయింది. బోడ శరబన్నకు చెందిన మట్టి మిద్దె గోడ వర్షానికి నాని పడిపోయింది.

రాచర్ల: మండలంలోని అనుమలవీడు గ్రామంలో పిన్నిక అల్లూరయ్యకు చెందిన మట్టి మిద్దె సోమవారం అర్ధరాత్రి సమయంలో కూలింది. అల్లూరయ్య, భార్య రంగలక్ష్మమ్మ పంచలో నిద్రిస్తున్న సమయంలో భారీ శబ్దంతో మిద్దె పైకప్పు కూలింది. భవన శిథిలాల కింద చిక్కుకుపోయిన భార్యను చూసి భర్త కేకలు వేయడంతో స్థానికులు స్పందించి ఆమెను బయటకు తీశారు. రంగలక్ష్మమ్మ తలకు రక్తగాయాలు కాగా 108 అంబులెన్స్‌లో గిద్దలూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. విలువైన సామగ్రి, నిత్యావసర సరుకులు, దుస్తులన్నీ పోయాయని, కట్టు బట్టలతో మిగిలామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన స్ధలాన్ని ఎంపీడీఓ ఎస్‌.వెంకటరామిరెడ్డి, ఏఎస్సై శ్రీనివాసరావు పరిశీలించి వివరాలు సేకరించారు.

కంభం: మండలంలోని హజరత్‌గూడెం గ్రామంలో దానమయ్యకు చెందిన మట్టి మిద్దె గోడ, పైకప్పు కొంత భాగం కూలిపోయింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇంట్లోని సామగ్రి కొంత మేర దెబ్బతిన్నాయి. చిన్నకంభంలో సుబ్బమ్మకు చెందిన మట్టి మిద్దె గోడ కూలిపోయింది ముందుగానే విషయం గ్రహించిన బాధితులు సామగ్రిని భద్రపరుచుకున్నారు. బాధిత కుటుంబంతో వీఆర్వో మస్తాన్‌ మాట్లాడి వివరాలు సేకరించారు.

యర్రగొండపాలెం: మండలంలోని అమానిగుడిపాడులో మంగళవారం మట్టి మిద్దె కూలింది. వంట సామగ్రి, బియ్యం, దుస్తులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కూలిన మిద్దెను తహసీల్దార్‌ మంజునాధరెడ్డి పరిశీలించారు. ప్రభుత్వ పరంగా పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. సుమారు రూ.లక్షకు పైగా నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు.

పిడుగా.. ప్రమాదమా?

కనిగిరిరూరల్‌: పట్టణంలోని దొరువు వద్ద కొండ కింద శివాలయం రహదారి సమీపంలో రేకుల షెడ్డుతో సహా ప్రహరీ మంగళవారం రాత్రి కూలిపోయిది. షెడ్డు కింద పార్కింగ్‌ చేసిన బైక్‌ దెబ్బతింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే పిడుగు పడిందన్న ప్రచారంతో స్థానికులు ఆందోళన చెందారు. రాత్రి వేళ కావడంతో పూర్తి స్థాయిలో ఆ ప్రాంతాన్ని పరిశీలించలేకపోయామని, పిడుగు పడిందో లేదో బుధవారం నిర్ధారిస్తామని అధికారులు చెబుతున్నారు.

కూలిన గృహాలు 1
1/1

కూలిన గృహాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement