అక్రమ కేసులకు భయపడం
గిద్దలూరు రూరల్: అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే సహించమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. మండలంలోని దొడ్డంపల్లెలో గత 65 రోజుల క్రితం అక్రమంగా అరెస్ట్ అయి బొర్రా క్రిష్ణారెడ్డి మంగళవారం హైకోర్టు ఇచ్చిన బెయిల్ మేరకు విడుదలయ్యారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, నాయకులు గిద్దలూరు సబ్ జైలు వద్ద నుంచి క్లబ్‌రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించి ఆయన్ను పరామర్శించారు. జోరువానలో వైఎస్సార్‌సీపీ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జగనన్న కోసం ఎన్ని కష్టాలనైన బరాయిస్తామని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ సీనియర్ నాయకుడు కృష్ణారెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపడం దారుణమన్నారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని నాశనం చేసేలా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. గతంలో ఇలాంటి కక్షపూరిత పాలన ఎప్పుడూ లేదన్నారు. అక్రమ కేసులకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవ్వరూ భయపడరన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. అక్రమ కేసుల్లో ఇబ్బందులు పడే నాయకులకు, కార్యకర్తలకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందన్నారు. పోలీసుశాఖ వారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదన్నారు. తుఫాన్ వల్ల ప్రజలు, రైతులు, అప్రమత్తంగా సురక్షితంగా ఉండాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి కేపీ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. ఘర్షణను నిలుపుదల చేయాలని చూసిన గ్రామ పెద్ద క్రిష్ణారెడ్డిని సైతం కేసుల్లో ఇరికించడం అన్యాయం అన్నారు. అనంతరం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం వల్ల పేదలకు వైద్య విద్య భారంగా మారుతుందన్నారు. జగనన్న ప్రభుత్వంలో పేదప్రజలకు ఎటువంటి లోటులేకుండా సుపరిపాలన కొనసాగిందన్నారు. నేడు కూటమి ప్రభుత్వం లోపభూయిష్టమైన పరిపాలన కొనసాగిస్తూ కేవలం కార్పొరేట్ సంస్థలకు లాభం కల్పించే దిశగా పరిపాలన కొనసాగిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కడప లక్ష్మీ, మాజీ ఎంపీపీలు కడప వంశీధరరెడ్డి, పి.శ్రీనివాసులు, వైఎస్సార్ సీపీ మున్సిపల్ కన్వీనర్ మానం బాలిరెడ్డి, మండల కన్వీనర్ బి.ఓబులరావు, వైఎస్సార్ సీపీ నాయకులు గోడి వెంకటేశ్వరరెడ్డి, పాలుగుళ్ల నరసింహారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీరంగం, సిఆర్‌ఐ మురళి, డా.భూమా నరసింహారెడ్డి, గర్రె చిరంజీవి, పాలుగుళ్ల సుబ్బారెడ్డి, కొమరోలు జెడ్పీటీసీ వెంకటనాయుడు, కంబం మాజీ ఏఎంసి నెమిలిదిన్నె చెన్నారెడ్డి, అర్ధవీడు ఎంపీపీ వెంకటరావు, మాజీ ఎంపీపీ రవికుమార్‌యాదవ్ పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి


