నీటమునిగిన ఒంగోలు..
ఒంగోలు నగరంలోని దాదాపు 20కి పైగా శివారు కాలనీలు నీట మునిగి ఇళ్లల్లోకి నీళ్లు వచ్చి చేరాయి. పోతురాజు కాలువ వంతెన వద్ద భారీగా నీరు నిలిచిపోయింది. కాలువ ఇరుగు పొరుగు కాలనీలు జలమయమయ్యాయి. ఈ రాత్రి వర్షం కురిస్తే నగరం మొత్తం నీట మునిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, కొప్పోలు దేవాలయం వరకు వరద నీరొచ్చేసింది. కొత్తపట్నం బస్టాండు చౌరస్తాలో నీరు నిలిచిపోయింది. పాత కూరగాయల మార్కెట్ నుంచి అద్దంకి బస్టాండ్ సెంటర్ వరకు రోడ్డు మీద వర్షం నీరు ప్రవహిస్తోంది. బాపూజీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న దుకాణాల్లోకి నీరు చేరింది. ఒంగోలు నగరంలో పాతకూరగాయల మార్కెట్, కర్నూలు రోడ్డుపై భారీగా నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కూరగాయల మార్కెట్ పరిసరాలు నీట మునిగాయి.గాంధీనగర్, చైతన్య కాలనీ, జయప్రకాశ్ కాలనీ, భగత్ సింగ్ కాలనీ, గోపాల్ నగర్ ప్రాంతాలు వరద నీటితో చెరువులను తలపిస్తున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ వద్ద భారీగా వరద నీరు చేరడంతో ప్రయాణికులు రాకపోకలకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో ఆర్టీసీ డిపోలోకి కూడా నీరు చేరింది. సుజాత నగర్, సమతా నగర్, పోలీసు ట్రైనింగ్ కళాశాలలు నీట మునిగాయి. సుజాత నగర్‌లోకి ఎక్కువగా నీరు చేరడంతో పరిసరాల్లో ఉన్న పోలీసు ట్రైనింగ్ కళాశాల ప్రాంగణంలోకి నీరు ప్రవహించింది. దీంతో ఎస్పీ హర్ష వర్ధన్ రాజు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో కలిసి పీటీసీ, సుజాత నగర్, సమతా నగర్ వరద ప్రాంతాల్లో పర్యటించారు. వరద నీటి ప్రవాహాన్ని నిలువరించడానికి వర్మ హోటల్ సమీపంలో ఉన్న డివైడర్ను బద్దలు కొట్టి పోతురాజు మేజర్ కాలువలోకి నీటిని మళ్లించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కర్నూలు రోడ్డులోని పాల కేంద్రం వద్ద ఎగువ నీరు మొత్తం వచ్చి రోడ్డులో ఒక వాగును తలపించింది. కలెక్టరేట్‌లో భారీ వృక్షం కూలిపోయింది. ప్రకాశం భవన్ భవన్ ఎదురుగా ఉన్న ఓల్డ్ రిమ్స్ లో విద్యుత్ స్తంభం నేలకొరిగింది. దీంతో దేవుడు చెరువు, సీఆర్పీ క్వార్టర్స్, హిల్ ఏరియా, సీతారాంపురం ప్రాంతాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అంబేడ్కర్ భవన్ రోడ్ లో చెట్టు పడిపోవడంతో వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. చెరువుకొమ్ముపాలెం వెళ్లే రోడ్డులో ఓ కారు వర్షం నీటిలో చిక్కుకుపోయింది.


