మద్దిపాడు: కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ జలాశయం నుంచి లక్షా 13 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. మల్లవరం వద్ద ఉన్న గుండ్లకమ్మ రిజర్వాయర్‌ను ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్‌తో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. గుండ్లకమ్మ పరివాహక ప్రాంతంలో ఉంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. రైతులను అప్రమత్తం చేస్తున్న విధానం, ప్రాజెక్టు వద్ద సందర్శకులను నియంత్రించేందుకు చేపట్టిన చర్యలపై సమీక్షించారు. అప్పటికప్పుడే స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దార్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీక్షలో ప్రాజెక్టు ఎస్‌ఈ అబూతాలిమ్, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జ్యోతి కుమారి ఇతర అధికారులు పాల్గొన్నారు.
మార్కాపురం: జలదిగ్బంధంలో 12 గేదెలు చిక్కుకోగా వాటిని కాపాడేందుకు బుధవారం ఒంగోలు నుంచి ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వచ్చాయి. చీకటి పడటంతో గురువారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టనున్నారు. స్థానిక ఇందిరమ్మ కాలనీలో నివాసముండే బాషా తన 12 గేదెలను నాగులవరం రోడ్డులోని సొంత పొలంలో షెడ్ వేసి పోషిస్తున్నాడు. మంగళవారం కురిసిన భారీ వర్షానికి గుండ్లకమ్మ పోటెత్తడంతో గేదెలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తహసీల్దార్ చిరంజీవి, పట్టణ ఎస్సై సైదుబాబు ఈతగాళ్ల సాయంతో గేదెలను ఇవతల ఒడ్డుకు తెచ్చేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఒంగోలు నుంచి ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని రప్పించారు.
తుఫాన్ ధాటికి 18 గొర్రెలు మృతి
గిద్దలూరు రూరల్: మండలంలోని ఉప్పలపాడు–ప్రతాప్‌రెడ్డి కాలనీ మధ్య బోయగారి తిప్ప వద్ద తుఫాన్ ధాటికి 18 గొర్రెలు మృతి చెందాయి. పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ బాలునాయక్ కథనం ప్రకారం.. కేఎస్ పల్లె గ్రామానికి చెందిన అన్నపురెడ్డి శ్రీనివాసులు గొర్రెలు 11, ఉప్పలపాడుకు చెందిన ఈశ్వరయ్య గొర్రెలు 7 మృత్యువాతపడ్డాయి. భారీ వర్షాలకు గొర్రెలు తడిసి అనారోగ్యానికి గురైనట్లు చెప్పారు. పోస్టుమార్టం నిర్వహించి నష్టపరిహారం నివేదికను తహసీల్దార్‌కు అందించారు.
‘గుండ్లకమ్మ’ నుంచి దిగువకు 1.13 లక్షల క్యూసెక్కులు


