నట్టడవిలో నరకయాతన
యర్రగొండపాలెం: మోంథా తుపాన్‌కు మంగళవారం రాత్రి నుంచి కురిసిన వర్షాలకు నల్లమల అటవీ ప్రాంతం జలమయమైంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని వాగుల్లో చేరిన నీరు ఉధృతంగా పారింది. ఈ నీరు హైవేరోడ్డును సైతం కోతకు గురిచేసింది. మంగళవారం అర్ధరాత్రి అటవీ ప్రాంతంలోకి చేరుకున్న 6 ఆర్టీసీ బస్సులు, 2 ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, ఇతర వాహనాలు యర్రగొండపాలెం–మాచర్ల హైవే రోడ్డులో నిలిచిపోయాయి. కనిగిరి, గిద్దలూరు, పామూరు ప్రాంతాలకు చెందిన ఆర్టీసీ బస్సులు, మార్కాపురం ప్రాంతానికి చెందిన ప్రైవేట్ ట్రావెల్ బస్సులు పుల్లలచెరువు మండలంలోని మురికిమళ్ల తండా దాటుకొని పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని దావుపల్లె సమీపంలోకి చేరాయి. అక్కడ రోడ్డు కోతకు గురైందని తెలిసి ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. తిరిగి వెనక్కి రావటానికి ప్రయత్నించారు. మురికిమళ్ల తండాకు సమీపంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అక్కడి వరకు వచ్చిన బస్సులు ఎటూ వెళ్లలేక అక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. ఆ బస్సులు, ఇతర వాహనాల్లో దాదాపు 450 మంది ప్రయాణికులు ఉన్నారు. బుధవారం ఉదయం కూడా నీటి ప్రవాహం ఆగలేదు. అక్కడి నుంచి ఎవరికై నా సమాచారం ఇవ్వటానికి ప్రయత్నించినా ఆ ప్రాంతంలో సిగ్నల్ లేకపోవడం వలన వారి ఫోన్లు పనిచేయకపోవడంతో 12 గంటలకుపైగా వారు నరకయాతన అనుభవించాల్సి వచ్చింది. హైవే రోడ్డు కోతకు గురైందన్న విషయం తెలుసుకున్న పోలీసులు స్థానిక టోల్ గేట్ వద్ద రాత్రి 10 గంటల నుంచి వాహనాలను వెనక్కి పంపించి వేశారు. కాగా, అటవీ ప్రాంతంలో ఇరుక్కున్న బస్సు డ్రైవర్లు టోల్‌గేట్ వద్ద చెబుతున్నా ముందుకు దూసుకెళ్లారని స్థానికులు తెలిపారు.
మానవత్వం చాటుకున్న ఎస్సై
సంఘటన గురించి డయల్ 100 ద్వారా తెలుసుకున్న ఎస్పీ హర్షవర్థన్‌రాజు ప్రయాణికులకు భరోసా ఇవ్వాలని పుల్లలచెరువు ఎస్సై సంపత్ కుమార్‌ను ఆదేశించారు. పుల్లలచెరువు మండల పరిధిలోని మురికిమళ్ల వరకు పర్యవేక్షించగా ఎక్కడా బస్సులు నిలిచిన దాఖలాల్లేవు. జిల్లా బార్డర్ దాటి పల్నాడు జిల్లాలో దాదాపు 12 కి.మీ దూరంలో బస్సులు నిలిచిపోయాయన్న విషయం తెలుసుకుని కోతకు గురైన రోడ్డు వరకు వెళ్లగలిగారు. అక్కడ నుంచి ముందుకు వెళ్లలేని పరిస్థితిలో అటుగా వచ్చిన జేసీబీలో ఎక్కి ప్రయాణికుల వద్దకు చేరుకుని ధైర్యం చెప్పారు. టిఫిన్, భోజనాల ఏర్పాట్లు చూడాలని హైవే సిబ్బందికి సూచించారు. తిరిగి ఆయన వెనక్కి వచ్చే సమయంలో కొందరిని జేసీబీలో ఎక్కించుకుని మురికిమళ్ల వైపు చేర్చారు. వెనక్కి వచ్చేవారిని ఇవతల ఒడ్డుకు చేర్చాలని జేసీబీని పంపించారు.
నల్లమలలో వాగుల ఉధృతికి ఇరుపక్కలా కోతకు గురైన హైవే
మధ్యలో చిక్కుకున్న 6 ఆర్టీసీ, 2 ప్రైవేట్ బస్సులు
బస్సులు ఇతర వాహనాల్లో దాదాపు 450 మంది ప్రయాణికులు
12 గంటలపాటు ప్రయాణికుల నరకయాతన
నట్టడవిలో నరకయాతన


