శ్రీశైలం ఘాట్‌లో విరిగిపడిన కొండచరియలు
పెద్దదోర్నాల: మండల పరిధిలోని నల్లమల అభయారణ్యంలో తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం రహదారిలోని గోర్లెస్ కాలువ, కర్నూలు రహదారిలోని దొంగలవాగులో పాటు మార్కాపురం రహదారిలోని తీగలేరు వాగులు పొంగి ప్రవహించాయి. శ్రీశైలం ఘాట్‌లోని తుమ్మలబైలు వద్ద కొండచరియలు విరిగి పడటంతో మంగళవారం సాయంత్రం 6.30 నుంచి బుధవారం సాయంత్రం 4.30 గంటల వరకు 22 గంటల పాటు శ్రీశైల పుణ్యక్షేత్రానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉన్నతాధికారులు వాహనాలను పెద్దదోర్నాలలో గణపతి చెక్‌పోస్టు వద్ద నిలిపి వేశారు. దీంతో శ్రీశైలం వెళ్లే భక్తులు, యాత్రికులు భారీ వర్షంలో రాత్రంతా చీకట్లోనే జాగారం చేశారు. నల్లమల అభయారణ్యంలో చిక్కుకున్న వాహనాలను తిరిగి శ్రీశైలం మళ్లించారు. కర్నూలు వెళ్లే వాహనాలను కుంట, దేవరాజుగట్టు, గిద్దలూరు, నంద్యాల మీదుగా దారి మళ్లించారు. మంగళవారం రాత్రి వర్షతీవ్రత అధికంగా ఉండటంతో సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది. విరిగిపడిన కొండచరియలను బుధవారం ఎస్సై మహేష్‌తో పాటు, అటవీశాఖ, నేషనల్ హైవే అధికారులు క్రేన్ల సహాయంలో తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. తీగలేరు వాగు ఉధృతంగా ప్రవహించటంతో చిన్నదోర్నాల వద్ద మార్కాపురం–దోర్నాల మధ్య వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
● తృటిలో తప్పిన ప్రమాదం
పొన్నలూరు: ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో లారీ దిగడంతో కొంత దూరం కొట్టుకుపోయి ఆగడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఈ సంఘటన పొన్నలూరు మండలం నాగిరెడ్డిపాలెం సమీపంలోని గొరెశల వాగు ఓవీ రోడ్డుపై బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మోంథా తుఫాన్ ప్రభావంతో నాగిరెడ్డిపాలెం సమీపంలోని గొరెశల వాగులోని వరద నీరు ఓవీ రోడ్డుపై ప్రవహిస్తున్నాయి. దీంతో మంగళవారం సాయంత్రం నుంచి పొన్నలూరు, కనిగిరి మధ్య ఓవీ రోడ్డుపై వాహనాల రాకపోకలను పోలీసులు, అధికారులు నిలిపివేశారు. అయితే వర్షం లేకున్నా వరద నీటి ప్రవాహం తగ్గలేదు. దీంతో బుధవారం కూడా వాహనాల రాకపోకలను నిలిపివేసి అధికారులు, పోలీసులు అక్కడే గస్తీ ఏర్పాటు చేశారు. అయితే మధ్యాహ్నం భోజనం చేయడానికి అధికారులు, పోలీసులు వెళ్లడంతో చైన్నె నుంచి కనిగిరికి వెళ్తున్న కంటైనర్ లారీని డ్రైవర్ వేళ మురుగన్ వరద నీటిలో ముందుకు పోనిచ్చాడు. కొంత దూరం వెళ్లిన తరువాత వరద నీటి ప్రవాహం పెరిగి లారీ నీటిలో కొట్టుకుపోయి బోల్తా కొట్టి ఆగిపోయింది. దీంతో డ్రైవర్, క్లీనర్ ఎడమ చేతివైపు ఉన్న డోర్‌ను తీసుకోని స్థానికుల సహాయంతో బయట పడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
శ్రీశైలానికి 22 గంటలు నిలిచిన రాకపోకలు
పరవళ్లు తొక్కిన దొంగలవాగు, గోర్లెస్‌కాలువలు
శ్రీశైలం ఘాట్‌లో విరిగిపడిన కొండచరియలు


