
వృద్ధులను ప్రేమ, గౌరవంతో చూడాలి
జిల్లా రెవెన్యూ అధికారి బీసీహెచ్.ఓబులేసు
ఒంగోలు సబర్బన్: వయో వృద్ధులు ప్రేమ, గౌరవంతో జీవించగలిగే ఒక సహాయక సమ్మిళిత సమాజాన్ని రూపొందించడానికి మనం కలిసి సంకల్పిద్దామని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) బీసీహెచ్.ఓబులేసు పిలుపునిచ్చారు. ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవాన్ని మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.ఓబులేసు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలోని వృద్ధులు సంఘాలు, వృద్ధాశ్రమ నిర్వాహకులు పాల్గొని వృద్ధుల సంక్షేమం, రక్షణ కోసం ప్రతిజ్ఞ చేశారు. విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు సీహెచ్.సువార్త మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం అవసరమైన సహాయాన్ని, చర్యలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా కొందరు వృద్ధులు తమ సమస్యలను తెలియజేయగా, డీఆర్వో వాటిలో కొన్నింటిని వెంటనే పరిష్కరించారు. వృద్ధాశ్రమ నిర్వాహకులు, వృద్ధుల సంఘ ప్రతినిధులు తమ అనుభవాలను పంచుకుని, సమస్యల పరిష్కారం కోసం అభ్యర్థనలు సమర్పించారు. ఈ సందర్భంగా వృద్ధుల సేవలో విశేషంగా సహకరించిన వారిని సన్మానించారు. అవసరమైన వృద్ధులకు చేతి కర్రలు పంపిణీ చేశారు.