
అధికారులా.. రౌడీలా?
బోగస్ ఇంటి పట్టాలు అంటూ దౌర్జన్యంగా నిర్మాణాలు కూలగొట్టించారు గిరిజనుల ఇంటి స్థలాలపై కన్నేసిన పచ్చనేతలు కూటమి ప్రభుత్వంలో రాజ్యమేలుతున్న దొంగలు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజం
యర్రగొండపాలెం: రెవెన్యూ అధికారులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని, బోగస్ ఇంటి స్థల పట్టాలని చెప్పి నిర్మాణాల్లో ఉన్న గృహాలను వారు దౌర్జన్యంగా కూలగొట్టించారని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఆరోపించారు. స్థానిక కొప్పుకొండకు సమీపంలో ఉన్న వెంకటగిరి కాలనీలో గుడిసెలు, నిర్మాణంలో ఉన్న ఇంటి గోడలు, నీటి తొట్లు కూల్చివేయించారని ఆ ప్రాంతం గిరిజనులు చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించి ఆదివారం ఆ ప్రాంతానికి వెళ్లి ఆ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1997, 2008 సంవత్సరాల్లో ప్రభుత్వం చెంచు గిరిజనులకు ఇచ్చిన ఇంటి పట్టాలు బోగస్ పట్టాలని తహసీల్దార్ కూలకొట్టించడం వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. గతంలో పట్టాలు ఇచ్చిన తహసీల్దార్లు బోగస్ పట్టాలు మంజూరు చేశారా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ అవి బోగస్ పట్టాలని ఏ విధంగా నిర్ధారించారని, చెంచు గిరిజనులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అక్కడ ఉన్న నిర్మాణాలను కూలగొట్టించడం హేయమైన చర్యఅని ఆయన అన్నారు. కొంతమంది టీడీపీ నాయకులు ఆ స్థలాలపై కన్నేసి, వాటిని కాజేయటానికి వేసిన పన్నాగాన్ని అధికారులు సమర్ధించి వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో దొంగలు రాజ్యమేలుతున్నారని, ఈ ప్రభుత్వం పేదలకు గృహాలు నిర్మించి ఇవ్వలేకపోయినా.. సొంతంగా నిర్మించుకుంటున్న గృహాలను కూల్చివేయిస్తోందని మండిపడ్డారు. ఆ ప్రాంతంలో గిరిజనులకు ఇంటి పట్టాలు ఇవ్వకుంటే రూ.1.80 కోట్లతో ఐటీడీఏ నిధులు ఖర్చుపెట్టి తారు రోడ్డు ఎందుకు వేయించిందని, తాగు నీటి కోసం బోరు ఏ విధంగా వేయించారని ఆయన అధికారులను ప్రశ్నించారు. ఆ ప్రాంతంలో గిరిజన కాలనీలు ఉన్నాయన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఐటీడీఏ నిధులను కేటాయించిన విషయాన్ని అధికారులు పరిగణలోకి తీసుకోకుండా టీడీపీ నాయకులు చెప్పిందే వేదంగా వ్యవహరిస్తున్నారని, గిరిజనులు గృహ నిర్మాణాలు చేయనీయకుండా గిరిజనులను రోడ్డున పడేస్తున్నారని అన్నారు. ఈ సంఘటనపై కలెక్టర్, ఎస్పీల దృష్టికి తీసుకెళ్తామని, గిరిజనులకు తమ పార్టీ అండగా నిలుస్తుందని, వారికి న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని ఆయన అన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ దొంతా కిరణ్‌గౌడ్, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి కొప్పర్తి చిన్న ఓబులరెడ్డి, మండల కన్వీనర్ ఏకుల ముసలారెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు పి.రాములు నాయక్, సర్పంచ్ ఆర్.అరుణాబాయి, వివిధ విభాగాల నాయకులు సయ్యద్ జబీవుల్లా, కందూరి కాశీవిశ్వనాథ్, ఆవుల కోటిరెడ్డి, బి.బాలచెన్నయ్య ఉన్నారు.