
బస్సుల్లో ఎక్కించుకోవాలని భక్తుల ఆందోళన
రెండు రోజులుగా మండల కేంద్రంలో ప్రయాణికుల రద్దీ
పెద్దదోర్నాల: శ్రీశైలం వెళ్లే బస్సుల్లో తమను ఎక్కించుకోవాలంటూ పలువురు భక్తులు ఆర్టీసీ బస్సుల ఎదుట ఆందోళన నిర్వహించి ఆర్టీసీ బస్సులను నిలువరించారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి పెద్దదోర్నాల ఆర్టీసీ బస్టాండులో చోటు చేసుకుంది. వివరాల మేరకు రెండవ శనివారం, ఆదివారం రెండు రోజులు సెలవు దినాలు కావటంతో మండల కేంద్రంలో శ్రీశైలం వెళ్లే యాత్రికులతో రద్దీ నెలకొంది. దీంతో శ్రీశైలం వెళ్లే పలు వాహనాలు యాత్రికుల రద్దీతో కిటకిటలాడాయి. ఈ నేపథ్యంలో ఆదివారం మండల కేంద్రంలో రద్దీ ఎక్కువ కావటంతో శ్రీశైలం వెళ్లే ప్రతి బస్సు వద్ద యాత్రికులు ఎగబడ్డారు. అయితే ప్రయాణికులకు సరిపడినన్ని బస్సులు ఏర్పాటు చేయలేదు. దీనికి తోడు ఘాట్ రోడ్‌లలో పరిమితికి లోబడి ప్రయాణికులతో వెళ్లాలన్న నిబంధనలు ఉండటంతో కొంత మంది ఆర్టీసీ సిబ్బంది అధిక లోడు ప్రయాణికులతో వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో తాము మూడు గంటల నుంచి బస్సుల కోసం కాసుకుని ఉన్నా తమను బస్సుల్లో ఎక్కించుకోలేదని కొందరు ప్రయాణికులు ఆందోళన నిర్వహించి బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో స్పందించిన ఆర్టీసీ కంట్రోలర్‌లు భక్తులకు నచ్చబెప్పి ప్రతి బస్సులో కొందరు ప్రయాణికులు ఎక్కేందుకు అవకాశం కల్పించటంతో గొడవ సద్దుమణిగింది.