నేతల మేత.. పేదలకు వాత..! | - | Sakshi
Sakshi News home page

నేతల మేత.. పేదలకు వాత..!

Oct 13 2025 9:04 AM | Updated on Oct 13 2025 9:04 AM

నేతల

నేతల మేత.. పేదలకు వాత..!

మార్కాపురం:

జిల్లాలో రేషన్‌ పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కూటమి ప్రభుత్వంలో ఆయా పార్టీల నాయకులు, మద్దతుదారులే రేషన్‌ డీలర్లుగా అవతారమెత్తి రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టించి స్వాహా చేస్తున్నారు. కార్డుదారులకు సక్రమంగా రేషన్‌ పంపిణీ జరగక లబోదిబోమంటున్నారు. జిల్లాలో యథేచ్ఛగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా సాగుతోంది. ఇటీవల నాగులుప్పలపాడు, పొన్నలూరు, మార్కాపురం ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని కేసులు మాత్రమే నమోదు చేసి బయటకు తెలుస్తుండగా, జిల్లావ్యాప్తంగా గుట్టుచప్పుడు కాకుండా విచ్చలవిడిగా రేషన్‌ దందా సాగుతోంది. రేషన్‌ కార్డుదారుల సమస్యలు పరిష్కరించడంతో పాటు రేషన్‌ పంపిణీ వ్యవస్థను సక్రమంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ఆహార సలహా సంఘ సమావేశాలు మొక్కుబడిగా సాగుతుండటంతో అక్రమార్కులు రోజురోజుకూ చెలరేగిపోతున్నారు. క్షేత్రస్థాయిలో తెల్ల రేషన్‌ కార్డుదారులు ఎదుర్కొంటున్న సమస్యలు అధికారుల దృష్టికి వెళ్లడం లేదు. ఒకవేళ వెళ్లినా.. పట్టించుకునేవారు లేకపోవడంతో కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో 6,37,820 రేషన్‌కార్డులు, 1,392 రేషన్‌ దుకాణాలు...

జిల్లాలో రేషన్‌ పంపిణీ ఒక ప్రహసనంలా మారింది. బియ్యానికి బదులుగా కిలోకు 10 రూపాయల డబ్బులిస్తామని, తీసుకుంటే తీసుకోండి.. లేదంటే లేదంటూ బాహాటంగానే రేషన్‌ డీలర్లు చెబుతున్నా పట్టించుకునే అధికారులు లేరు. ఎక్కడైనా రేషన్‌ బియ్యం పట్టుబడితే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే అధికారులు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇలాంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహించాల్సిన ఆహార సలహా సంఘ సమావేశాలు జిల్లాలో నాలుగైదు చోట్ల మాత్రమే మొక్కుబడిగా సాగాయి. టంగుటూరు, కంభం, గిద్దలూరు, ఒంగోలు తదితర ప్రాంతాల్లో ఈ సమావేశాలు నిర్వహించగా, మిగిలిన చోట వీటి ఊసే లేదు. గత నెల 16న ప్రభుత్వం (వినియోగదారుల కమిషన్‌) సమావేశాలు నిర్వహించాలని చెప్పడంతో మొక్కుబడిగా నిర్వహించారు. జిల్లాలో మొత్తం 6,37,820 రేషన్‌కార్డులు ఉండగా, 1392 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. ప్రతి నెలా సుమారు 10,582 మెట్రిక్‌ టన్నుల బియ్యం జిల్లాకు వస్తోంది. కానీ, పేదలకు సక్రమంగా అందకుండా కూటమి నాయకులు స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

మొక్కుబడిగా సమావేశాలు...

జిల్లా వ్యాప్తంగా ఆహార సలహా సంఘాలు పూర్తిస్థాయిలో పనిచేయకపోవటంతో సమావేశాలు మొక్కుబడిగా జరుగుతున్నాయి. సక్రమంగా సమావేశాలు నిర్వహించకపోవటంతో వినియోగదారులకు అందాల్సిన నిత్యావసర వస్తువులు సక్రమంగా అందడం లేదు. అధికారులను ప్రశ్నించే కమిటీ లేకపోవటంతో నిత్యావసర వస్తువుల పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ప్రస్తుతం రేషన్‌దుకాణాలు అలంకారప్రాయంగా మిగిలాయి. గతంలో బియ్యం, చక్కెర, కిరోసిన్‌, గోధుమలు, కందిపప్పు, నూనె, గోధుమపిండి, ఉప్పు ఇచ్చేవారు. ఇప్పుడు కేవలం బియ్యం, చక్కెరకు మాత్రమే పరిమితమయ్యాయి.

కమిటీ ఇలా...

ఆహార సలహా సంఘ కమిటీలో ఆర్డీఓ, తహసీల్దార్‌, ఒక డీలర్‌, ప్రింట్‌ మీడియా సభ్యుడు, ఎంపీడీఓ, నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన వ్యక్తులు ఉంటారు. వీరందరూ నెలవారీగా సమావేశాలు నిర్వహించి కార్డుదారుల ఇబ్బందులు, తదితర అంశాలపై చర్చించి ప్రత్యేక రిజిష్టర్‌ తయారు చేయాల్సి ఉంటుంది. పౌరసరఫరా గోడౌన్‌ నుంచి రేషన్‌ దుకాణాలకు వచ్చే సరుకుల వివరాలపై సభ్యులకు పూర్తి స్థాయిలో సమాచారం ఉండాలి. కానీ, కమిటీల సమావేశం జరగకపోవడంతో సమస్యలు అధికారుల దృష్టికి పోవటం లేదు. రేషన్‌ బియ్యం పలు చోట్ల పక్కదారి పడుతోంది. మార్కాపురం, తర్లుపాడు, మర్రిపూడి మండలాల్లో కొంతమంది రేషన్‌ డీలర్లు బాహాటంగానే బియ్యం బదులుగా కిలోకు 10 రూపాయలు డబ్బులిస్తామని చెబుతున్నారు.

జిల్లాలో అస్తవ్యస్తంగా రేషన్‌ పంపిణీ వ్యవస్థ

కూటమి నాయకుల కనుసన్నల్లో పక్కదారి పడుతున్న రేషన్‌ బియ్యం

బియ్యంకు బదులు కిలోకు రూ.10 ఇస్తామంటున్న డీలర్లు

తమ సమస్యలు పట్టించుకునేవారు లేరంటున్న కార్డుదారులు

మొక్కుబడిగా ఆహార సలహా సంఘ సమావేశాలు

కమిషన్‌ ఆదేశాలు పట్టించుకోవడం లేదు

జిల్లాలో ఆహార సలహా సంఘ సమావేశాలను గత నెల 16వ తేదీ నిర్వహించాలని కమిషన్‌ ఆదేశించింది. అక్కడక్కడా మాత్రమే కొంతమంది తహసీల్దార్లు నిర్వహించారు. అవి కూడా మొక్కుబడిగా సాగాయి. కొన్నిచోట్ల డిప్యూటీ తహసీల్దార్లే ఈ సమావేశాలు పెట్టారు. వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలంటే సమావేశాలు నిర్వహించడం లేదు. దీనివలన ప్రభుత్వం దృష్టికి కార్డుదారుల సమస్యలు వెల్లడం లేదు. రేషన్‌ దుకాణాలు, పెట్రోల్‌ బంకులను కమిటీ సభ్యులతో కలిసి అధికారులు తనిఖీ చేయాలని ఆదేశాలిచ్చినప్పటికీ అమలు కావడం లేదు. ఇప్పటికై నా సమావేశాలు నిర్వహించి రేషన్‌ కార్డుదారుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి.

– ఓఏ మల్లిక్‌, జిల్లా వినియోగదారుల సమాఖ్య గౌరవాధ్యక్షుడు

నేతల మేత.. పేదలకు వాత..!1
1/1

నేతల మేత.. పేదలకు వాత..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement