
మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో డీఎస్సీ కౌన్సెలింగ్ నిర
ఒంగోలు సిటీ: మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో డీఎస్సీ కౌన్సెలింగ్ నిర్వహించాలని బీటీఏ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు కర్ర దేవసహాయం అన్నారు. బహుజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా అత్యవసర సమావేశం శనివారం ఉదయం 10 గంటలకు బీటీఏ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు కర్ర దేవసహాయం మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ 2025 కౌన్సెలింగ్ జీఓ నంబర్ 90 ప్రకారం సెలెక్షన్ లిస్టును రీ ఆర్గనైజ్ చేసి మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. కమిషనర్ ఇచ్చిన నియమాలను అనుసరించి కేవలం మెరిట్ ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారని, ఈ విధానాన్ని బీటీఏ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. కేవలం మెరిట్ ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించడం వలన రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని బీటీఏ పక్షాన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్, కమిషనర్ విజయరామరాజుకు వినతిపత్రాలను మెయిల్ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పటి వరకు జరిగిన కౌన్సెలింగ్‌ను రద్దు చేసి జీఓ నంబర్ 90 అనుసరించి మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరారు. బీటీఏ రాష్ట్ర కార్యదర్శి పారాబత్తిన జాలరామయ్య మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రిజర్వేషన్ వర్గాల వారికి తీవ్రంగా అన్యాయం చేసిందన్నారు. పదోన్నతుల్లో, బదిలీల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా కేవలం మెరిట్ ప్రకారం నిర్వహించి రిజర్వ్ వర్గాల వారికి వ్యతిరేకంగా చేసిందని చెప్పారు. సమావేశంలో బీటీఏ జిల్లా ప్రచార కార్యదర్శి పల్లె కృష్ణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షుడు కొండమూరి కొండల రాయుడు, జిల్లా నాయకులు చెక్క కోటేశ్వరరావు, బాజీ బాబు తదితరులు పాల్గొన్నారు.