
ఇసుక తోలలేక!
టీడీపీ నాయకుల దౌర్జన్యాలు
జిల్లాలో ఇసుక వ్యాపారులపై అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు లైసెన్స్ పొందినవారు అమ్మకాలు చేయకుండా పచ్చమంద సొంత దందా లైసెన్స్ రద్దు చేయాలంటూ ఒంగోలు యార్డు నిర్వాహకుడు భరత్ మైనింగ్ డీడీకి వినతి జిల్లాకు ప్రభుత్వం మంజూరు చేసింది 6 డంపింగ్ యార్డులు 38 మండలాల్లోనూ ప్రైవేటుగా యార్డులు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అదనంగా రూ.500 నుంచి రూ.700 వసూలు నెలవారీ ముడుపులు తీసుకొని ప్రైవేటు ఇసుక డంప్‌ల మీద చర్యలు
బెల్టు షాపుల తరహాలో ఇసుక యార్డులు..
తమ్ముళ్లతో తాళలేక..
‘‘ఇసుక డంపింగ్ యార్డు నిర్వహణకు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చింది. అయితే కొంతమంది వ్యక్తులు ప్రైవేటుగా వాహనాల్లో తెచ్చి సొంతంగా ఇసుక అమ్ముకుంటున్నారు. ఒక్క ఒంగోలు నగరంలోనే 40 మంది వ్యక్తులు సొంతంగా ఇసుక డంపింగ్ చేస్తున్నారు. వారితో నేను పోరాడే పరిస్థితి లేదు. ఇక్కడ వ్యాపారం చేసే పరిస్థితులు లేవు. ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్‌ను దయచేసి రద్దు చేయండి...’’ అంటూ ఫ్యూచర్ ట్రెండ్స్‌కు చెందిన భరత్ మైనింగ్ డిప్యూటీ డైరక్టర్ రాజశేఖర్‌కు వినతి పత్రం అందచేయడం జిల్లాలో అధికార కూటమి నేతల ఇసుక ఆగడాలకు అద్దం పడుతోంది. లైసెన్స్ పొందిన వ్యాపారులపై తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల దౌర్జన్యాలు, రౌడీయిజానికి అంతేలేకుండా పోతోందనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచితంగా ఇసుక ఇస్తున్నట్లు తెగ ప్రచారం చేసుకుంటున్నారు. మరో వైపున మద్యం బెల్ట్ షాపుల తరహాలో ప్రైవేటు డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసుకున్న తమ్ముళ్లు యథేచ్ఛగా ఇసుక దందాకు పాల్పడుతున్నారు. ఫలితంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు అధిక ధరలకు ఇసుకను కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక పేరుతో గత ఏడాది నవంబరులో జిల్లాలోని ఒంగోలు, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, కనిగిరి, దర్శి ప్రాంతాల్లో డంపింగ్ యార్డులకు అనుమతిచ్చి లైసెన్స్‌లు మంజూరు చేసింది. ఫ్యూచర్ ట్రెండ్స్ సంస్థ నిర్వాహకుడు భరత్‌కు ఒంగోలు డంపింగ్ యార్డుకు లైసెన్స్ మంజూరైంది. భరత్ పశ్చిమ ప్రకాశం జిల్లా అధికార పార్టీకి చెందిన ఒక కీలక ఎమ్మెల్యే అనుచరుడిగా ప్రచారం జరుగుతోంది. ఈ లైసెన్స్ కోసం ఆయన కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. జనవరిలో ఆయన డంపింగ్ యార్డు ఏర్పాటు చేసుకున్నారు. అప్పటికే నగరంలో టీడీపీకి చెందిన కొందరు నాయకులు సొంతంగా డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసుకుని ఇసుక విక్రయాలు ప్రారంభించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇలాంటి ప్రైవేటు డంపింగ్ యార్డులు ఒక్క ఒంగోలు నగరంలోనే సుమారు 40 యార్డులు ఉన్నట్లు భరత్ ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ అధిక ధరలకు ఇసుక విక్రయించడమే కాకుండా ప్రభుత్వ డంపింగ్ యార్డులో ఇసుక కొనుగోలు చేయకుండా కస్టమర్లపై ఒత్తిళ్లు చేసేవారని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ డంపింగ్ యార్డు నిర్వాహకుడైన భరత్ ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికే కోటి రూపాయల చేతిచమురు వదిలించుకున్న ఆయన డంపింగ్ యార్డుకు తాళాలు వేసి వెళ్లిపోయాడు. ఇటీవల కలెక్టర్ పిలుపు మేరకు ఒంగోలు వచ్చిన ఆయన తిరిగి డంపింగ్ యార్డు తెరిచినప్పటికీ తెలుగు తమ్ముళ్ల దందా ముందు తాళలేకపోయాడు. ఈసారి ఏకంగా తన లైసెన్స్ రద్దు చేయమంటూ ఆయన మైనింగ్ డీడీకి వినతి పత్రం అందించడంతో జిల్లాలో తెలుగు తమ్ముళ్ల ఉచిత ఇసుక దోపిడీపై చర్చకు తెరతీసినట్లయింది.
ఇసుక అమ్మకాల విషయంలో జిల్లాలో తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యాలు, అరాచకాలపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. కీలక నాయకులు నిర్ణయించిన టీడీపీ నాయకులు మాత్రమే ఇసుక అమ్మకాలు చేయాలని హుకుం జారీ చేసి బహిరంగంగా దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇసుక వ్యాపారుల మీద దాడులు చేశారు. వారి టిప్పర్లను ధ్వంసం చేశారు. లారీ డ్రైవర్లను చితకబాది వేధింపులకు గురిచేశారు. లారీలను స్వాధీనం చేసుకున్నారు. తమకు కప్పం కట్టకుండా జిల్లాలో ఇసుక విక్రయించడానికి వీలులేదని రౌడీయిజం చెలాయించారు. టిప్పర్ల యజమానులకు కోట్లాది రూపాయలు ఇవ్వకుండా వేధించడంతో వారు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగడం సంచలనం సృష్టించింది. తాజాగా మరో వ్యక్తి తనకు ఇచ్చిన లైసెన్స్‌ను రద్దు చేయమని కోరడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మైనింగ్ అధికారులైతే మొద్ద నిద్ర పోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. మైనింగ్ అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో బెల్టు షాపుల తరహాలో ఇసుక యార్డులు కూడా వెలిశాయి. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఈ అనధికారిక యార్డులు నడుస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. తాము చెప్పిన రేటుకే ఇసుక అమ్మకాలు చేయాలని హుకుం జారీ చేస్తున్నారు. తమ వద్దకాదని ఇతర ప్రాంతాల నుంచి ఇసుకను తెచ్చుకుంటే లారీకి వారు చెప్పిన కప్పం కట్టి వెళ్లాల్సిందే. లేదంటే అధికారులను ఉసిగొల్పి అక్రమ కేసులు బనాయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం గిద్దలూరులో అధికారికంగా ఇసుక డంపింగ్ యార్డు నిర్వహణకు లైసెన్స్ మంజూరు చేసింది. నియోజకవర్గంలో ఎవరైనా సరే ఇక్కడ నుంచి ఇసుక కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ అధికార టీడీపీ కీలక నేత ఇక్కడ సొంతంగా ప్రతి మండలంలోనూ ఇసుక డంపింగ్ యార్డులకు అనుమతి ఇవ్వడం విమర్శల పాలవుతోంది. నియోజకవర్గంలోని కొమరోలు, రాచర్ల, అర్ధవీడు, బేస్తవారిపేట, కంభంలలో ఇసుక డంపింగ్ యార్డులు పెట్టి అనధికారికంగా ఇసుక అమ్మకాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్కాపురం నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పొదిలిలో అనధికారికంగా డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి అధిక ధరలకు ఇసుక విక్రయాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మార్కాపురంలో అధిక ధరలకు ఇసుక విక్రయాలు చేస్తున్నారు. నేరుగా ఇసుక తెచ్చుకుంటే రూ.900 కు వచ్చే ఇసుక ఇసుకను రూ.1500 కు విక్రయిస్తున్నారు. దీంతో ప్రజల జేబుకు రూ.600 వరకు చిల్లు పడుతోంది. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని త్రిపురాంతకం, పుల్లలచెరువు, పెద్దారవీడు, దోర్నాల మండలాల్లో కూడా అనధికారికంగా డంపింగ్ యార్డులు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి కనుసన్నల్లోనే ఈ యార్డులను ఏర్పాటు చేసి దొడ్డిదారిన ఇసుక విక్రయాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక దర్శి నియోజకవర్గంలో అయితే టీ ట్యాక్స్ వసూలు చేసేందుకు ఒక కంటైనర్ ఏర్పాటు చేయడం గమనార్హం. ఎక్కడనుంచైనా నియోజకవర్గంలోకి ఇసుక లారీ, ట్రాక్టర్ వచ్చిందంటే వీరికి ట్యాక్స్ కట్టాల్సిందే. ఇక జిల్లా కేంద్రమైన ఒంగోలులో 40 వరకు ఇసుక డంపింగ్ యార్డులు ఉన్నట్లు అధికారిక డంపింగ్ యార్డు నిర్వాహకుడు భరత్ ఆరోపణలు చేయడం గమనార్హం. కొండపి నియోజకవర్గానికి డంపింగ్ యార్డు మంజూరు చేయలేదు. జరుగుమల్లి, పొన్నలూరు మండలాలు పాలేరు నదీ తీర ప్రాంతంలో ఇసుక లభ్యమౌతుంది. ఇక్కడ నుంచి టీడీపీ నాయకులు ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వుకుంటున్నారు. ట్రాక్టర్ లోడింగ్ రూ.800 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లిలో అనధికారికంగా ఇసుకను అమ్మేసుకుంటున్నారు. కనిగిరిలో ట్రాక్టర్‌కు రూ.500 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.