
ప్రజలే శ్రమదానం..!
ప్రభుత్వ వైఫల్యం..
ఒంగోలు – మంగమూరు రోడ్డుపై పాడైపోయి ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతంలో
మరమ్మతులు చేస్తున్న మంగమూరు యువకులు
సంతనూతలపాడు:
కూటమి ప్రభుత్వంలో చెప్పేదొకటి..చేసేదొకటి అనేదానికి రోడ్లే నిదర్శనంగా ఉన్నాయి. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రంలోని రోడ్లన్నింటికీ మరమ్మతులు చేయించామని సీఎం చంద్రబాబు నుంచి ఎమ్మెల్యేల వరకూ గొప్పలు చెప్పుకుంటుండగా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. అనేక ప్రధాన రహదారులు సైతం అధ్వానంగా మారి ప్రయాణికుల నడ్డి విరుస్తున్నాయి. ఇలాంటి ఓ రోడ్డు గురించి పాలకులు, అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అనేక మంది వాహనదారులు ప్రమాదాలకు గురై గాయాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆరు నెలల క్రితం ఏకంగా ఒక మహిళ మృత్యువాతపడింది. ఈ రోడ్డు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉందా అంటే.. అదేమీ కాదు. జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలోనే ఉంది. అదే.. ఒంగోలు నుంచి మంగమూరు వెళ్లే రోడ్డు. ఈ రోడ్డులో సుందరమ్మ వాగు వద్ద తారు రోడ్డు 20 అడుగుల పొడవున ఉబ్బెత్తుగా మారి ప్రమాదాలకు నిలయమైంది. కొణిజేడు కొండ నుంచి ఎర్రమట్టిని ఓవర్ లోడుతో తరలిస్తూ వాహనాలు తిరుగుతుండటంతో ఈ రోడ్డుపై కొంతభాగం దెబ్బతింది. రోడ్డు ఉబ్బెత్తుగా మారిన ప్రాంతం ప్రమాదాలకు కారణమవుతోంది.
రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగి పలువురికి గాయాలు...
రాత్రి వేళల్లో ఒంగోలు నుంచి మంగమూరు రోడ్డుపై ప్రయాణం చేసేవారు సుందరమ్మ వాగు వద్ద ఉబ్బెత్తుగా మారిన రోడ్డును గమనించ ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కిందపడి గాయపడుతున్నారు. ఆరు నెలల క్రితం మంగమూరు గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఒంగోలు వెళ్లి రాత్రివేళ తిరిగి ఇంటికొస్తూ ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడ్డారు. వాహనం వెనుకవైపు కూర్చున్న మహిళ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఒంగోలులోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో సుమారు పది లక్షల రూపాయలు వెచ్చించి చికిత్స పొందినప్పటికీ ఫలితం దక్కలేదు. చివరకు మృత్యువాత పడింది. తరచూ ఎవరో ఒకరు అదే ప్రాంతంలో ప్రమాదాలకు గురవుతూ గాయపడుతున్నారు. గత శుక్రవారం రాత్రి కూడా మంగమూరుకు చెందిన ఒక యువకుడు ఒంగోలు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తూ ఉబ్బెత్తుగా ఉన్న తారు రోడ్డు వద్ద వాహనం అదపుతప్పి కిందపడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో ఒంగోలులోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. వరుస ప్రమాదాలతో మంగమూరు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో వారే స్వయంగా రంగంలోకి దిగారు. మంగమూరు అంబేడ్కర్ నగర్‌కు చెందిన యువకులు శనివారం ఉదయం శ్రమదానం చేసి ఉబ్బెత్తుగా మారి ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్డు భాగాన్ని తవ్వి చదును చేశారు. ఇక్కడే కాకుండా ఓవర్ లోడుతో వాహనాలు ప్రయాణించడం వలన మంగమూరు – ఒంగోలు రోడ్డు పలు చోట్ల పాడైపోయి ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డుకు పూర్తిగా మరమ్మతులు నిర్వహించి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. శ్రమదానం చేసి రోడ్డుకు మరమ్మతులు చేసిన వారిలో మంగమూరు అంబేడ్కర్ నగర్ యువకులు కొండసింగు ధనుంజయ, పైడి హనుమంతరావు, పందిపాటి రవి, కసుకుర్తి శివ, కంకణాల వెంకటేశ్వర్లు, మంచికలపాటి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
పాడైపోయి వాహన ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్డు
పలువురు ప్రమాదాలకు గురై గాయాలతో ఆస్పత్రి పాలు
ఆరు నెలల క్రితం ఒక మహిళ మృతి
శుక్రవారం రాత్రి యువకుడికి గాయాలు
నెలల తరబడి పట్టించుకోని పాలకులు, అధికారులు
స్వచ్ఛందంగా మరమ్మతులు చేసుకున్న యువత
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యపు పాలనకు నిలువెత్తు నిదర్శనం

ప్రజలే శ్రమదానం..!