
బతక నీవక!
కర్షకుడి కష్టం దోచుకుంటున్న బాబు ప్రభుత్వం పదమూడు నెలల్లో 10 మంది అన్నదాతలు బలవన్మరణం కనీసం ఆ కుటుంబాలను ఆదుకున్నదీ లేదు.. మిర్చి, పత్తి, శనగ, పొగాకు, వరి రైతులు కుదేలు కనీస మద్దతు ధర రాక ఆర్థికంగా నష్టపోయిన వైనం యూరియా లెక్కల్లో గోల్‌మాల్ బ్లాక్ మార్కెట్‌లో రూ.450 నుంచి రూ.500 వరకు అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు
సాగు నీవక..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
జిల్లాలో 2024–25 రబీ సీజన్‌లో సాధారణంగా 3,97,880 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుచేయాల్సి ఉంది. అయితే, కేవలం 2,99,331 ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. వేసిన పంటల్లో కూడా దాదాపు లక్షకుపైగా ఎకరాల్లో నిలువునా ఎండిపోయాయి. మిగతా 1.99 లక్షల ఎకరాల్లో కూడా సగానికిపైగా ఎకరాల్లో దిగుబడి మరీ దారుణంగా పడిపోయింది. ఇక ఖరీఫ్ సీజనూ అంతే. జిల్లాలో 1,29,102 హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా 20 శాతం కూడా సాగుకాలేదని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఏడాది కాలంలో మిర్చి, పొగాకు, వరి, శనగ, పత్తి ఇలా అన్ని రకాల రైతులు కనీస మద్దతు రాక ఆర్థికంగా కుదేలయ్యారు. కనీస పెట్టుబడులు రాక, చేసిన అప్పులు తీర్చలేక 13 నెలల కాలంలో జిల్లా వ్యాప్తంగా 13 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఫలితంగా ఆ కుటుంబాలు దిక్కులేనివయ్యాయి. జిల్లాలో అన్నదాతల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాల్లేవు.
దర్శిలో పక్కదారి..కొండపిలో ఖాళీగా ఆర్‌ఎస్‌కేలు..గిద్దలూరులో అరకొరగా..
జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 24 వేల టన్నుల యూరియా అందుబాటులో ఉందని చెబుతున్నారు. మరో పక్క వెయ్యి టన్నుల యూరియా జిల్లాకు వస్తుందంటూ జేసీ ప్రకటించడం గమనార్హం. మరో వైపు ఆర్‌ఎస్‌కేల్లో నిల్వఉన్న యూరియాను పచ్చనేతలు చెప్పిన వారికే ఇవ్వాలంటూ హుకుం జారీ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దర్శి నియోజకవర్గంలో ఆర్‌ఎస్‌కేలకు చేరాల్సిన యూరియా అధికార పార్టీ నేతల దుకాణాలకు వెళుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా దుకాణాలకు 30 శాతం, ఆఎస్‌కేలు, సొసైటీలకు 70 శాతం యూరియా అందాల్సి ఉంది. వచ్చిన డైబ్బె శాతం యూరియాను కూడా టీడీపీ అనుకూల ఎరువుల దుకాణాదారులు నేరుగా తమ గోడౌన్‌లలో దింపుకుని బ్లాక్ మార్కెట్‌లో గుట్టు చప్పుడు కాకుండా అధిక ధరలకు రైతులకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ధర ప్రకారం రూ.266.50 కు విక్రయించాలి. అయితే దర్శి నియోజకవర్గంలో యూరియా ధరలు బ్లాక్ మార్కెట్‌లో రూ.450 నుంచి రూ.500 వరకు ఉంది. అయితే నియోజకవర్గంలో యూరియా కొరత సృష్టించి మొత్తం బ్లాక్ మార్కెట్‌లో అమ్మకాలు చేపట్టారు.ఇక కొండపిలో అయితే మండల స్థాయి వ్యవసాయాధికారులు రైతు సేవా కేంద్రాల్లో యూరియా పుష్కలంగా ఉందని చెబుతున్నా ఆర్‌ఎస్‌కేల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. నియోజకవర్గం మొత్తంలో కేవలం మర్రిపూడి మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రంలో మాత్రమే యూరియా అందుబాటులో ఉంది. ప్రైవేటు దుకాణాల్లో యూరియా బస్తా ధర రూ.266 రూపాయలకు అమ్మాల్సి ఉండగా రూ.350 కు అమ్ముతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో యూరియా ఆర్‌ఎస్‌కేలకు పూర్తి స్థాయిలో అందడంలేదు. అరకొరగా రావడంతో రైతులు అధిక ధరకు దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. గిద్దలూరులోని ఉయ్యాలవాడ, గడికోట ఆర్‌ఎస్‌కేలలో 25 టన్నులకు 12 టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. అర్థవీడు మండలంలో ప్త్రెవేట్ దుకాణాల్లో గుళికలు తీసుకుంటేనే యూరియా ఇస్తున్నారు. 12 టన్నులకు ఆర్డర్ పెడితే నేటికి రాలేదు. కంభం, రావిపాడు రైతు భరోసా కేంద్రాలకు 12 టన్నుల యూరియా ఆర్డర్ పెడితే ఆరు టన్నులే వచ్చింది. బేస్తవారిపేట మండలం పిటికాయగుళ్లలో రైతులకు సరఫరా చేయాల్సిన యూరియాలో ఇప్పటి వరకు సగమే ఇచ్చారు. రాచర్ల మండలంలో గడిచిన రెండు నెలలుగా జేపీ చెరువు రైతు సేవా కేంద్రంలో ఇప్పటి వరకూ యూరియా స్టాక్ లేకపోవడంతో రైతులు ప్రైవేటు ఎరువుల షాపుల్లో కొనుగోలు చేసుకుంటున్నారు. ఇలా అరకొరగా యూరియా పంపిణీ చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

బతక నీవక!