
పోరు సింహాలై!
జిల్లా వ్యాప్తంగా కదంతొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు ‘అన్నదాత పోరు’కు అడుగడుగునా పోలీసుల అడ్డంకులు సోమవారం అర్ధరాత్రి నుంచే వైఎస్సార్ సీపీ నాయకులు, రైతులకు ముందస్తు నోటీసులు పోరుబాట అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుటిల పన్నాగాలు ఒంగోలు, మార్కాపురం, కనిగిరిల్లో రైతులు, ప్రజలతో కలసి భారీ ర్యాలీలు అన్ని చోట్లా ర్యాలీలకు అడ్డంగా బారికేడ్లు
రైతు నేస్తాలై..
సాక్షిప్రతినిధి, ఒంగోలు:
పోలీసులను అడ్డంపెట్టుకొని ప్రభుత్వం బెదిరింపులకు దిగినా ఎక్కడా తగ్గకుండా, సర్కారు కళ్లుతెరిపించేలా వైఎస్సార్ సీపీ శ్రేణులు రైతులతో కలసి జిల్లా వ్యాప్తంగా ‘అన్నదాత పోరు’ నిర్వహించాయి. జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లలో జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని హోరెత్తించారు. అన్నదాతలకు అండగా వైఎస్సార్ సీపీ రైతు పోరు కార్యక్రమానికి పోలీసులు జిల్లా వ్యాప్తంగా అడుగడుగునా ఆంక్షలు పెట్టారు. జిల్లాలో 30 పోలీసు యాక్టు అమలులో ఉందంటూ అర్ధరాత్రి 12 గంటలు దాటిన తరువాత ఎస్సైలందరూ వాట్సప్‌లలో మెసేజులు పెట్టారు. ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనలకు అనుమతులు లేవని పేర్కొన్నారు. తెల్లవారగానే పోలీసులు ముఖ్య నాయకుల ఇళ్ల వద్దకు వచ్చి రైతు పోరు కార్యక్రమాల్లో పాల్గొనవద్దని నోటీసులు ఇచ్చారు. ముఖ్యమైన కూడళ్లు, ఊరి బయట, రహదారుల వద్ద పోలీసులు నిఘా పెట్టారు.
మూడు విడతలుగా పోలీసుల అడ్డంకులు:
ఒంగోలు నగరంలో అన్నదాత పోరు కార్యక్రమానికి పోలీసులు మూడు విడతలుగా అడ్డంకులు సృష్టించారు. అంబేడ్కర్ భవన్ నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఆర్‌డీఓ కార్యాలయంలో ఆర్‌డీఓకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంబేడ్కర్ భవన్ రోడ్డులోనే రైతులను, వైఎస్సార్‌సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ నుంచి పరిమితిగా వెళ్లాలంటూ ఆంక్షలు పెట్టారు. వందలాది మందిగా వచ్చిన పార్టీ శ్రేణులు, రైతులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడా పోలీసుల విధులను ఆటకం కలిగించకుండా పూర్తిగా సహకరించారు. అయినా మధ్యలో ఒకసారి, ఆర్‌డీఓ కార్యాలయం ముందు కూడా పరిమిత సంఖ్యలో వచ్చిన వారిని కూడా లోనికి పోనీయకుండా పోలీసులు అడ్డుకోవటంతో ఆర్‌డీఓ కార్యాలయం ఎదుట భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
కనిగిరిలో ఆరంభంలోనే కట్టడి..
కనిగిరి డివిజన్ కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, కనిగిరి ఇన్‌చార్జి దద్దాల నారాయణ యాదవ్, మున్సిపల్ చైర్మన్ గఫార్ ఇంటి మలుపు వద్ద నుంచి బయటకు వచ్చి రైతులు, ప్రజలతో కలసి రోడ్డుఎక్కగానే సీఐ ఎస్‌కే ఖాజావలి, ఎస్సైలు అడ్డుకున్నారు. ఇంత మందికి అనుమతి లేదని నిలిపారు. శాంతియుతంగా బస్టాండ్ వరకు ర్యాలీగా వస్తామని.. ఆ తర్వాత మీ నిబంధనల ప్రకారమే మీరు అనుమతిచ్చిన వారినే ఆర్డీఓ కార్యాలయంలోకి పంపుతామని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి చెప్పారు. దాన్ని కూడా పోలీసులు సమ్మతించలేదు. 30 యాక్ట్ అమలులో ఉందని సీఐ చెప్పడంతో.. శాంతి యుతంగా ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చర్చి సెంటర్ వరకు వస్తామని పార్టీ నేతలు చెప్పారు. కొద్ది సేపు నేతలకు, పోలీసులకు వాదన జరిగింది. అనంతరం అక్కడే బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి రైతులను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆ తర్వాత చర్చి సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లేందుకు అంగీకారం తెలిపారు. చర్చి సెంటర్ నుంచి కేవలం అనుమతి పొందిన పేర్ల జాబితాలో ఉన్న ప్రజా ప్రతినిధులను, రైతులను, నాయకులను, మాత్రమే ఆర్డీఓ ఆఫీసులోకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. అనంతరం వారు ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు.
అడుగడుగునా ఆంక్షలు
మార్కాపురం పట్టణంలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. వైఎస్సార్ సీపీ అన్నదాత పోరు కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించారు. అయినా మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల నుంచి ద్విచక్ర వాహనాలు, ఆటోల ద్వారా నాయకులు, రైతులు, ప్రజలు, కార్యకర్తలు మార్కాపురం పట్టణానికి తరలివచ్చారు. పోలీసు ఆంక్షలను కూడా లెక్కచేయకుండా రైతులు కార్యకర్తలు సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. రైతు బాగుంటేనే అందరమూ బాగుంటాము. మీరు కూడా రైతు బిడ్డలే అంటూ పోలీసులకు నచ్చచెప్పి రైతు పోరు కార్యక్రమానికి వచ్చారు. సబ్‌కలెక్టర్ కార్యాలయంలోకి ఎవరూ ప్రవేశించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి ఐదుగురిని మాత్రమే సబ్‌కలెక్టర్ కార్యాలయం లోకి వెళ్లేందుకు అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. వారి సూచనలు పాటిస్తూ యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్, మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు, గిద్దలూరు ఇన్‌చార్జి కేపీ నాగార్జునరెడ్డి సబ్‌కలెక్టర్ కార్యాలయానికి తమ అనుచరులతో వచ్చారు. పాత బస్టాండులోని వైఎస్సార్ విగ్రహానికి, కోర్టుసెంటరులోని అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, అన్నా రాంబాబు పూల మాలలువేసి నివాళులర్పించారు. సబ్‌కలెక్టర్ త్రివినాగ్‌కు తాటిపర్తి చంద్రశేఖర్, అన్నా రాంబాబు, కుందురు నాగార్జునరెడ్డి ఇతర నాయకులు వినతిపత్రం అందచేశారు. రైతుల సమస్యలను వారు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు.
ఆర్థికంగా చితికిపోయి విలవిల్లాడుతున్న రైతన్నకు అండగా నిలిచేందుకు ఎరువుల కొరత, పంటలకు మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం అసమర్థ పాలన, వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్సార్ సీపీ చేపట్టిన అన్నదాత పోరుకు అడుగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. ప్రభుత్వ పెద్దల సూచనలతో ఎన్ని ఆంక్షలు పెట్టినా..ర్యాలీలకు అడ్డంగా బ్యారికేడ్లు పెట్టినా.. కర్షకులతో కలసి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కదంతొక్కారు. కూటమి ప్రభుత్వంపై రణభేరి మోగించారు. అర్ధరాత్రి నుంచే నోటీసులతో పోలీసులు హడావుడి సృష్టించినా మంగళవారం ఒంగోలు, మార్కాపురం, కనిగిరి డివిజన్ కేంద్రాల్లో పోరుబాట చేపట్టారు. తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఒంగోలులో రైతులు, కార్యకర్తలను రానీయకుండా బారికేడ్లతో అడ్డుకుంటున్న పోలీసులు
మార్కాపురంలో ఆర్డీఓ కార్యాలయం బయట భారీగా చేరుకున్న రైతులు, కార్యకర్తలు

పోరు సింహాలై!

పోరు సింహాలై!

పోరు సింహాలై!

పోరు సింహాలై!