కూటమి గద్దె దిగాలి | - | Sakshi
Sakshi News home page

కూటమి గద్దె దిగాలి

Sep 10 2025 10:20 AM | Updated on Sep 10 2025 10:20 AM

కూటమి గద్దె దిగాలి

కూటమి గద్దె దిగాలి

కూటమి గద్దె దిగాలి

రైతులు బాగుపడాలంటే

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక్క రోజు కూడా అధికారంలో ఉండే అర్హత కోల్పోయిందని వైఎస్సార్‌ సీపీ కొండపి ఇన్‌చార్జి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల ఆక్రందనలు ఈ ప్రభుత్వానికి వినపడటం లేదా.. కనపడడం లేదా.. లేదంటే నిద్ర నటిస్తోందా అని మండిపడ్డారు. వైఎస్సార్‌ సీపీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కేంద్రం ఒంగోలులో మంగళవారం రైతులకు అండగా అన్నదాత పోరు కార్యక్రమం చేపట్టారు. జిల్లా కేంద్రం ఒంగోలులో పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వందలాదిగా రైతులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు హాజరై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. అన్నదాత పోరు నిరసన కార్యక్రమానికి పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడంపై మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం పరిపాలనలో తీవ్రంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. రాష్ట్రంలో 40 శాతానికి పైగా ఎరువుల కొరత ఉన్నట్లు స్పష్టమవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం నిద్ర నటిస్తోందని ధ్వజమెత్తారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రధానంగా యూరియాతోపాటు ఇతర ఎరువుల కొరతను నివారించాలని, బ్లాక్‌ మార్కెట్‌ను నియంత్రించాలన్నారు. రైతు పండించే ప్రతి పంటకు మద్దతు ధర కల్పించాలని, ధరల స్థిరీకరణ నిధిని పునరుద్ధరించాలని, ఉచిత పంటల బీమాను ఏర్పాటు చేయాలని, అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

వైఎస్సార్‌ సీపీ జిల్లా పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ ఇస్తానంటే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్న చంద్రబాబుకు రైతులంటేనే ఏహ్య భావం ఉందన్నారు. రైతు కన్నీరు పెడితే ఆ ఉసురు పాలకులకు తగలకపోదని బత్తుల ఆక్షేపించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కావాలని అడిగితే 40 మంది రైతులను 45 రోజుల పాటు జైలులో పెట్టించిన ఘనుడు చంద్రబాబును అని నిప్పులు చెరిగారు.

ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరు రవికుమార్‌ మాట్లాడుతూ.. యూరియా కావాలంటే డీలర్లు కాంప్లెక్స్‌ ఎరువులు కొనుక్కోవాలని డిమాండ్‌ చేయడం ఎంతవరకు సబబన్నారు. వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్న యువత మొత్తం చంద్రబాబు సీఎం అయ్యాక వెనకడుగు వేసే పరిస్థితి దాపురించిందన్నారు. ప్రస్తుత పరిణామాలతో గ్రామాలు ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొందన్నారు.

రాష్ట్ర మాదిగ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కొమ్మూరి కనకారావు మాదిగ మాట్లాడుతూ.. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్‌ను సీఎం చంద్రబాబు ఆత్మహత్యలప్రదేశ్‌గా మారుస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటికీ రైతు వ్యతిరేకమేనని మరోసారి రుజువు చేశారని దుయ్యబట్టారు.

తొలుత జాతీయ నాయకులు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలకు, అనంతరం చర్చి సెంటర్‌లోని దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం ఒంగోలు ఆర్‌డీఓ లక్ష్మీ ప్రసన్నకు రైతు సమస్యలపై వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు మారెళ్ల బంగారు బాబు, ఒంగోలు నగర పార్టీ అధ్యక్షుడు కఠారి శంకర్‌, జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, ఆళ్ల రవీంద్రా రెడ్డి, పాలడగు రాజీవ్‌, మన్నె శ్రీనివాసులు, లంకపోతు అంజిరెడ్డి, మలిశెట్టి దేవేంద్ర, దానం కరుణాకర్‌, మీరా వలి, వేమా శ్రీనివాస రావు, భూమిరెడ్డి రమణమ్మ, యనమల మాధవి, ప్రమీల, ప్రసన్న, రమణమ్మ, మసనం వెంకట్రావు, పిన్నిక శ్రీనివాసరావు, బచ్చల కోటేశ్వర రావు, చింతపల్లి ఫణీంద్ర, ఇనకొల్లు సుబ్బారెడ్డి, దుద్దుగుంట మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అన్నదాతలను అన్నివిధాలా వేధిస్తున్న కూటమి ప్రభుత్వం పాలించే అర్హత కోల్పోయింది

వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తక్షణమే రాజీనామా చేయాలి

మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ కొండపి ఇన్‌చార్జి ఆదిమూలపు సురేష్‌ ధ్వజం

ఒంగోలులో వైఎస్సార్‌ సీపీ ‘అన్నదాత పోరు’కు అడుగడుగునా పోలీసుల అడ్డంకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement