
స్నేహితుడే కాలయముడు!
బేస్తవారిపేట: బేస్తవారిపేట జంక్షన్ సమీపంలో వైఎస్సార్ సీపీ కార్యకర్త గాలి బ్రహ్మయ్య(25)ను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ప్రేమించిన యువతి తండ్రికి తన గురించి చెడుగా చెప్పాడన్న అనుమానంతో మృతుడికి స్నేహితుడైన యువకుడు, తన మరో ఇద్దరు మిత్రులతో కలిసి హత్యకు పూనుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. సోమవారం బేస్తవారిపేట పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో హత్య కేసు వివరాలను డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. బ్రహ్మయ్య, గడ్డం వెంకట సాయి తేజ(రవి) ఇద్దరు స్నేహితులు. రవి అదే గ్రామంలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఇష్టపడిన అమ్మాయికి చెడుగా చెప్పడంతోపాటు తన ప్రేమను చెడగొట్టాడని బ్రహ్మయ్యపై రవి కక్ష పెట్టుకున్నాడు. జంక్షన్ సమీపంలో త్రిలోక పుణ్యక్షేత్రానికి వెళ్లే రోడ్డు పక్కన ఖాళీ ప్లాట్లలో తరచూ ఫోన్ మాట్లాడుతున్న బ్రహ్మయ్యను అక్కడే చంపాలని నిర్ణయించుకున్నాడు. హత్య చేయడానికి 15 రోజులుగా ముందుగానే ఓ కత్తిని ఖాళీ ప్లాట్లలో దాచిపెట్టాడు. ఒక్కడినే హత్య చేయలేనని భావించి, అతని వాటర్‌ప్లాంట్‌లో గతంలో పనిచేసిన బాలుడికి డబ్బు ఆశ చూపాడు. ఈనెల 3వ తేదీన బ్రహ్మయ్యను హత్య చేసేందుకు పథకం సిద్ధం చేశానని, వాటర్ ప్లాంట్‌లో పనిచేసిన వ్యక్తికి చెప్పాడు. అతను మరో స్నేహితుడితో కలిసి సాయిబాబా ఆలయానికి వెళ్లే రోడ్డులో కాపుకాశారు. హత్య జరిగిన రాత్రి 10 గంటల సమయంలో బ్రహ్మయ్య, రవి ఇద్దరు కలిసి మద్యం తాగారు. ఈ క్రమంలో యువతితో ప్రేమను చెడగొట్టిన విషయం, ఆ యువతి తండ్రికి చెడుగా చెప్పడంపై రవి ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుసుకుంది. మద్యం మత్తులో ఉన్న బ్రహ్మయ్యపై రవి తన ఇద్దరు మైనర్ స్నేహితులతో కలిసి బండరాయితో దాడి చేశాడు. అనంతరం ఛాతీపై ఆరుసార్లు కత్తితో పొడిచారు. బ్రహ్మయ్య మృతదేహాన్ని చిల్లచెట్లలోకి ఈడ్చుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టారు. బ్రహ్మయ్యకు చెందిన సెల్‌ఫోన్, హత్యకు ఉపయోగించిన వస్తువులను చిన్నకంభం సమీపంలోని ఉప్పువాగులో పడేశారు. ప్రధాన నిందితుడు రవి, తన ఇద్దరు మైనర్ స్నేహితులను ఆదివారం మధ్యాహ్నం జేబీకే పురం రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. సమావేశంలో కంభం సీఐ మల్లికార్జున, బేస్తవారిపేట, కంభం ఎస్సైలు ఎస్‌వీ రవీంద్రారెడ్డి, బి.నరసింహారావు పాల్గొన్నారు.
దరగా గ్రామానికి చెందిన బ్రహ్మయ్య హత్య కేసులో ముగ్గురు అరెస్టు
యువతిని ప్రేమించే విషయంలో గొడవే హత్యకు కారణం
నిందితుల్లో ఇద్దరు మైనర్లు
కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ నాగరాజు