అక్రమ కేసులు.. వేధింపులు | - | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులు.. వేధింపులు

Sep 9 2025 12:26 PM | Updated on Sep 9 2025 12:26 PM

అక్రమ కేసులు.. వేధింపులు

అక్రమ కేసులు.. వేధింపులు

నిమజ్జన ఊరేగింపు వివాదంలో మరో 50 మందిపై కేసులు హత్యాయత్నం కేసులు నమోదు చేసి ఆరుగురు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలకు రిమాండ్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, న్యాయవాదులపై 132 బీఎన్‌ఏఎస్‌ఎస్‌ కేసు నమోదు డీఎస్పీ శ్రీనివాసరావు వైఖరికి నిరసనగా నేడు విధుల బహిష్కరణకు బార్‌ అసోసియేషన్‌ పిలుపు శ్రీనగర్‌ కాలనీలో బిక్కు బిక్కుమంటున్న భక్తులు

ఒంగోలు టౌన్‌: వినాయక నిమజ్జనం ఊరేగింపు వివాదంలో అక్రమ కేసులతో పోలీసులు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గణేష్‌ నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్న భక్తులు, వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై హత్యాప్రయత్నం కేసులు నమోదు చేయడమే కాకుండా ఆరుగురు కార్యకర్తలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. అంతే కాకుండా మరో 50 మందిపై కూడా కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా న్యాయవాదులు, పరామర్శకు వెళ్లిన పార్టీ నాయకుల మీద కూడా కేసులు పెట్టడం విమర్శలపాలవుతోంది.

జగన్‌ పాటలు పెట్టడమే నేరమా...

నగరంలోని శ్రీనగర్‌ కాలనీ 4వ లైనులో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని గణేష్‌ మండపాన్ని ఏర్పాటు చేశారు. పోలీసుల అనుమతితో ఆదివారం నిమజ్జనానికి బయలుదేరారు. భక్తులు, మహిళలు, చిన్నారులు, వృద్ధులు, వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సాహంలో ఉన్న కొందరు యువకులు ఊరేగింపులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి సంబంధించిన పాటలు పెట్టారు. ఇదే పెద్ద నేరమైపోయిందని కాలనీ వాసులు, గణేష్‌ భక్తులు, వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు వాపోతున్నారు. నిజానికి ఈ నిమజ్జన ఊరేగింపు కర్నూలు రోడ్డు, ఆర్టీసీ బస్టాండు, అద్దంకి బస్టాండు సెంటర్‌, కొత్తపట్నం బస్టాండు సెంటర్ల మీదుగా కొత్తపట్నం బీచ్‌కు వెళ్లాల్సి ఉంది. ఊరేగింపులో రెండు డీజేలను కూడా ఏర్పాటు చేశారు. ఊరేగింపు మొదలైనప్పటి నుంచి పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడం మొదలు పెట్టినట్లు కాలనీ వాసులు చెబుతున్నారు. ఊరేగింపు ఫ్‌లై ఓవర్‌ బ్రిడ్జి దగ్గరకు రాగానే ట్రాఫిక్‌ ఎస్సై దాసరి శ్రీనివాసరావు, కానిస్టేబుల్‌ జి.రవికుమార్‌ అడ్డుకున్నారు. డీజే ధ్వంసం చేయడానికి ప్రయత్నించినట్లు కొందరు గణేష్‌ భక్తులు చెబుతున్నారు. దీంతో గణేష్‌ భక్తులు, మహిళలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, భక్తులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒక మహిళ ఎత్తుకొని ఉన్న చిన్నారి కిందపడిపోయింది. ఆందోళనకు గురైన మహిళలు చిన్నారిని కాపాడుకునే ప్రయత్నంలో పోలీసులను పక్కకు తోశారు. ఈ ప్రయత్నంలో మరికొందరు మహిళలు కూడా కిందకు పడిపోయారు. తోపులాట జరుగుతున్న సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీచార్జి చేయడంతో పలువురు మహిళలు, చిన్నారులకు దెబ్బలకు తగిలాయి. వాహనంపై అమర్చిన డీజేలను కూడా పోలీసులు తీసుకెళ్లారు. అయినా భక్తులు ఊరేగింపుగా కొత్తపట్నం బయలుదేరారు. ఈ ఘటనను మనసులో ఉంచుకున్న పోలీసులు కొత్తపట్నంలో నిమజ్జనం చేయకుండా అడ్డుకున్నట్లు భక్తులు చెబుతున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆరుగురు కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి ఒంగోలు తాలూకా పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

శ్రీనగర్‌ కాలనీలో భయాందోళనలో భక్తులు..

వినాయక నిమజ్జనం ఊరేగింపు ఘటనలకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఆరుగురు భక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. మరో 50 మందిపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనడంతో శ్రీనగర్‌ కాలనీలో భక్తులు, వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు బిక్కుబిక్కుమంటున్నారు. డివిజన్‌లోని 1వలైనులో నివసించే ఒక టీడీపీ నాయకుడు చెప్పిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సదరు టీడీపీ నాయకుడు ఎవరి పేరు చెబుతారోనన్న ఆందోళన కనిపిస్తోంది. దేవుడి ఊరేగింపును కూడా రాజకీయాలు చేయడమేమిటని పలువురు భక్తులు విమర్శిస్తున్నారు.

పరామర్శకు వెళ్లిన వారిపై కేసులు...

వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను అరెస్టు చేసి తాలూకా పోలీసు స్టేషన్‌కు తీసుకొస్తున్నారన్న సమాచారంతో నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు కొంతమంది న్యాయవాదులతో కలిసి పోలీసు స్టేషన్‌ వద్దకు వెళ్లారు. అక్కడ వారు లేకపోవడంతో డీఎస్పీని కలిసి మాట్లాడదామని డీఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఆయన ముందే పోలీసు వ్యానులో పార్టీ కార్యకర్తలను తీసుకొని రావడంతో వారిని పరామర్శించేందుకు ప్రయత్నించారు. ఈలోపు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తన చాంబర్‌ నుంచి బయటకు వచ్చారని, వచ్చీ రాగానే ఆగ్రహంతో కేకలు పెడుతూ చుండూరి రవిబాబు, ఒంగోలు బార్‌ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాదులు నగరికంటి శ్రీనివాసరావు, జయచంద్ర నాయక్‌, షేక్‌ హిదాయతుల్లాపై అగ్గిమీద గుగ్గిలమయ్యారని న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. న్యాయవాదులనుద్దేశించి కులం పేరుతో దూషించారని, ఇక్కడేం పనిరా అంటూ బూతులు తిట్టారని చెబుతున్నారు. అంతటితో ఆగకుండా చుండూరి రవిబాబు, ముగ్గురు న్యాయవాదులపై విధులను అడ్డుకున్నట్లు 132 బీఎన్‌ఎస్‌ఎస్‌ కేసులు నమోదు చేయడంపై న్యాయవాదుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

దేవుడి బొమ్మ గిఫ్ట్‌ ఇచ్చినందుకు అరెస్టు చేస్తారా...

వినాయక నిమజ్జనం ఊరేగింపు సమయంలో పోలీసుల మీద దాడి చేసినందుకు ఆరుగురి మీద హత్యాప్రయత్నం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్న మాటలు నిజం కాదని స్థానికులు చెబుతున్నారు. ఈ కేసులో 6వ నిందితుడిగా ఉన్న మురుక నారాయణ రెడ్డిని వినాయకుడి విగ్రహం గిఫ్ట్‌గా ఇచ్చినందుకు అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు. దేవుడి బొమ్మ గిఫ్ట్‌గా ఇవ్వడం కూడా నేరమేనా అని పలువురు గణేష్‌ భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆరుగురి మీదే కాకుండా మరో 50 మంది మీద కూడా కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరెంత మంది అమాయకులను అరెస్టు చేస్తారోనని విమర్శిస్తున్నారు. అధికార తెలుగు దేశం పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లొంగి తప్పుడు కేసులు నమోదు చేయవద్దని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement