
లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన ఉండాలి
● ఐసీడీఎస్ పీడీ సువర్ణ
ఒంగోలు సబర్బన్: పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల వ్యతిరేక చట్టం–2013 గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఐసీడీఎస్ పీడీ సువర్ణ పేర్కొన్నారు. సోమవారం మీ కోసం భవన్‌లో మహిళా అభివృద్ధి, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ శక్తి–సంకల్ప్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులకు ఈ కార్యక్రమంలో ప్రొటెక్షన్, ప్రివెన్షన్, రెడ్రసెల్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్‌కు సంబంధించి జిల్లాలో పని చేస్తున్న ఏ కార్యాలయంలోనైనా, ఏ శాఖలోనైనా, పదిమంది లేదా అంతకంటే ఎక్కువమంది మహిళా ఉద్యోగులు ఉంటే కచ్చితంగా లోకల్ కంప్లైంట్స్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. సదరు వివరాలను పీడీ ఐసీడీఎస్ వారికి అందజేయాలని కలెక్టర్ ఆదేశించారన్నారు. కార్యక్రమంలో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ఎంతమంది సభ్యులు ఉండాలి, కమిటీ ఆవశ్యకతను గురించి వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాల కృష్ణ, డీఆర్‌ఓ, ఒంగోలు ఆర్డీవో, వన్ స్టాప్ సెంటర్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఒంగోలు సిటీ: ‘కళాఉత్సవ్–2025’ ను జిల్లా స్థాయిలో సెప్టెంబరు 11, 12 తేదీల్లో ఆయా ఉమ్మడి జిల్లాల్లోని డైట్ లలో నిర్వహించనున్నట్లు డైట్ కళాశాల ప్రిన్సిపాల్ సామా సుబ్బారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల్లోని సృజనాత్మకత, కళాకౌశలం తదితర అంశాలను వెలికితీసి వారికి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో మంచి గుర్తింపును అందించే ప్రక్రియే ఈ ‘కళాఉత్సవ్–2025’ అని అన్నారు. ఇందులో 6 ప్రధాన, 12 ఉపప్రధాన అంశాల్లో ఈ పోటీలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 56 మండలాల పరిధిలోని 9,10,11,12 తరగతులు చదివే ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు గల ప్రైవేట్, కేజీబీవీ, ఏపీ మోడల్ స్కూల్స్, సంక్షేమ గురుకులాలు, విద్యార్థినీ విద్యార్థులు అర్హులని తెలిపారు. ఈ నెల 11వ తేదీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, పర్చూరు డివిజన్లు, 12వ తేదీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, కందుకూరు డివిజన్లలో జరిగే ఈ పోటీల్లో పాల్గొనాలని కోరారు.