
నానోయ్!
యూరియా అడుగుతుంటే నానో యూరియా వాడుకోవాలని పాలకుల ఉచిత సలహా
కొరత లేదని చెప్పేందుకు సీఎం చంద్రబాబు సహా కూటమి నేతల తంటాలు
బ్లాక్ మార్కెట్ దందా బాగోతాన్ని కప్పిపుచ్చేందుకు విశ్వప్రయత్నాలు
నానో యూరియా వినియోగంతో నష్టమేనని ప్రకటించిన పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం
నానో ఉత్పత్తుల ప్రభావంపై రైతుల ప్రశ్నలకు నీళ్లు నములుతున్న అధికారులు
దర్శి: యూరియా ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుందని ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు సెలవిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అదేమంటే.. ఈ ఏడాది ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు పాలసీ తీసుకొస్తున్నామని చెప్పుకొచ్చారు. మంత్రుల దగ్గర నుంచి స్థానిక ఎమ్మెల్యేల వరకు అందరూ ఇదే పాట పాడుతున్నారు. వాస్తవానికి ఒక ఎకరా విస్తీర్ణంలో సాగు చేసే పంటల రకాన్ని బట్టి ఎరువులు ఎంత మోతాదులో వినియోగించాలో వ్యవసాయ శాస్త్రవేత్తలు వెల్లడిస్తారు. నిర్దేశిత పరిమాణంలో రైతులకు ఎరువులు సరఫరా చేయాల్సిన కూటమి ప్రభుత్వం ఖరీఫ్ ప్రారంభంలోనే చేతులెత్తేసింది.
ఖరీఫ్ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రైతు సేవా కేంద్రాలకు గానీ, సొసైటీలకు గానీ ఎరువులు పూర్తి స్థాయిలో చేర్చకుండా పాలకులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ పంట సాగు ఇప్పటి వరకు 45 శాతం మించలేదు. అయినప్పటికీ ఎరువుల కొరత ఉత్పన్నమవుతోందంటే పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం.. ఎరువులను సైతం ఎమ్మార్పీ ధరకు ఇవ్వలేకపోవడంపై రైతులు మండి పడుతున్నారు.
బ్లాక్ దందాను కప్పెట్టేందుకే..
రైతులకు అందించాల్సిన యూరియాను అక్రమంగా నిల్వ చేయడం, అత్యధికంగా వరి, ఇతర పంటలు సాగు చేస్తున్న ప్రాంతాలకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకోవడం, పరిశ్రమల అవసరాలకు తరలిపోతున్న యూరియాను అడ్డకోకపోవడంతో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితులు దాపురించాయి. యూరియా కొరత ఏర్పడే ప్రమాదాన్ని ముందుగా పసిగట్టకుండా చోద్యం చూసిన ప్రభుత్వం.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా పస లేని వాదనలు తెరమీదికి తెస్తుండటంపై రైతులు మండిపడుతున్నారు. యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలించిన వారిలో కూటమి నేతల హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండటం, రైతులు, రైతు సంఘాల నాయకులు ధర్నాలకు దిగుతుండటంతో దిక్కుతోచని స్థితిలో నానో యూరియా పేరుతో కూటమి నేతలు సహా వ్యవసాయాధికారులు కవర్ డ్రైవ్‌లు చేస్తుండటం చర్చనీయాంశమైంది.
పాడి రైతుల గోడు పట్టేదెవరికి?
పంటకు యూరియా దొరక్క రైతులు అల్లాడుతుంటే.. పాడి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గేదెలకు ఆహారంగా అందించే సొప్ప, పచ్చి గడ్డి లాంటి రకాలకు యూరియా తప్పనిసరి. ఇతర రకాల ఎరువులు అధిక ధరకు కొని వేసినా యూరియాతో వచ్చే పెరుగుదల రాదని పాడి రైతులు చెబుతున్నారు. పచ్చిగడ్డి కొరత కారణంగా పాల దిగుబడి కూడా తగ్గిపోతోందని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నానోయ్!