
కూటమి పాలనలో రైతు కంట కన్నీరే..
● మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కొండపి ఇన్‌చార్జి ఆదిమూలపు సురేష్
సింగరాయకొండ:
కూటమి ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడం లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ మంత్రి కె.అచ్చెన్నాయుడు ప్రవర్తనే ఇందుకు నిదర్శనమని, ఎరువుల కోసం రైతులు పడుతున్న బాధలే సాక్ష్యమని వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. సింగరాయకొండలోని వైఎస్సార్ సీపీ క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మంగళవారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన అన్నదాత పోరు నిరసన కార్యక్రామన్ని విజయవంతం చేయాలని రైతులు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏటా 16 లక్షల టన్నుల ఎరువులు అవసరమైతే కేవలం 11 లక్షల టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల వెల్ఫేర్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం ఏపీలో 40 శాతం ఎరువుల కొరత ఉందన్నారు. యూరియా వాడితే క్యాన్సర్ సోకుతుందని సీఎం చంద్రబాబు చెప్పడాన్ని తప్పుబట్టారు. కేంద్రం సరఫరా చేసే ఎరువులను మనకు ఎంత అవసరమో తెప్పించకుండా, బ్లాక్‌మార్కెట్‌ను ప్రోత్సహిస్తూ ఎరువుల వాడకం తగ్గించాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. రూ.266 యూరియా బస్తాను బ్లాక్‌మార్కెట్‌లో రూ.450 అమ్ముతుంటే సీఎం, మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో బాపట్ల, కృష్ణా, కడప జిల్లాలో ఎరువుల కొరత ఉందని సాక్షాత్తు చంద్రబాబే ఒప్పుకున్నారని గుర్తు చేశారు.
ఈఎస్సై ఆస్పత్రుల కుంభకోణం, వ్యవసాయ పరికరాల కొనుగోలు కుంభకోణాల్లో నిండా మునిగిన అచ్చెన్నాయుడు ఇప్పుడు ఎరువుల వ్యవహారంలో రూ.300 కోట్ల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ సంవత్సరం మార్కెఫెడ్ ద్వారా సొసైటీలు, ఆర్‌బీకేలు, మార్కెట్ కమిటీల ద్వారా సరఫరా చేసే ఎరువుల కన్నా ప్రైవేటుకు అధనంగా పంపిణీ చేశారని, ఇందుకు చంద్రబాబు, అచ్చెన్నాయుడు భేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అన్నదాత పోరులో భాగంగా ఎరువులు, పురుగు మందుల కొరత లేకుండా చూడాలని, బ్లాక్ మార్కెట్ పై ఉక్కుపాదం మోపి ఎరువులను ప్రక్కదారి పట్టిస్తున్న వారిపై ఎస్మా చట్టం విధించాలని, పంటలకు గిట్టుబాటు ధర, భీమా కల్పించాలని, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మంగళవారం ఒంగోలు ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రాలు అందజేస్తామని, ఈ కార్యక్రమానికి రైతులు, పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం అన్నదాత పోరు వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. పార్టీ మండల అధ్యక్షుడు చింతపల్లి హరిబాబు, దుద్దుగుంట మల్లికార్జునరెడ్డి, బచ్చల కోటేశ్వరరావు, జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, ఎంపీపీ కొండాబత్తిన మాధవరావు, పార్టీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర బత్తుల అశోక్‌కుమార్‌రెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి బొట్ల రామారావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.