
బోధన సామర్థ్యాలు పెంచుకోవాలి
ఒంగోలు సిటీ: మారుతున్న కాలానికి అనుగుణంగా టీచర్స్ తమ బోధనా సామర్థ్యాలను పెంచుకొని విద్యార్థులకు నైపుణ్యం, నైతికతతో కూడిన విద్యను అందజేసి వారిని ఉన్నత శిఖరాలకు చేరుకొనేలా మీ భోధన కొనసాగాలని డీఈఓ ఏ.కిరణ్‌కుమార్ అన్నారు. ఒంగోలు ఎన్‌టీఆర్ కళా క్షేత్రంలో ఆదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (అపుస్మా) ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్‌కుమార్ మాట్లాడారు. ఉపాధ్యాయులు కాలపరీక్షకు తట్టుకొని నిలబడాలని తాము బోధించే విద్య ద్వారా సమాజ స్థితిగతులను మార్చగలుగుతారన్నారు. రాబోవు కాలంలో కృత్రిమమేధ ద్వారా విద్యాబోధన జరిగే అవకాశం ఉందని దానికి తగిన విధంగా ఉపాధ్యాయులు తమ సామర్ధ్యలను మెరుగుపరచుకోవాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన అపుస్మా జిల్లా అధ్యక్షుడు కొల్లా మాధవరావు మాట్లాడుతూ అపుస్మా యూనియన్ ప్రతిసంవత్సరం క్రమం తప్పకుండా జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి వారికి సన్మానం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అపుస్మా జోన్–3 ప్రెసిడెంట్ ఏ.వి.సుబ్బారావు, ప్రతిభ విద్యాసంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, శ్రీ హర్షిణి విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్, శ్రీ సరస్వతి విద్యాసంస్థల చైర్మన్ ఆవుల వెంకటరమణారెడ్డి, జిల్లాలోని అన్ని నియోజకవర్గ అధ్యక్షులు, 100 మందికి పైగా కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.