ఎఫ్‌ఆర్‌ఎస్‌తో ముప్పుతిప్పలు | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఆర్‌ఎస్‌తో ముప్పుతిప్పలు

Jul 29 2025 4:40 AM | Updated on Jul 29 2025 9:27 AM

ఎఫ్‌ఆ

ఎఫ్‌ఆర్‌ఎస్‌తో ముప్పుతిప్పలు

బేస్తవారిపేట: ఎన్నికల సమయంలో జీతాలు పెంచుతామని అంగన్‌వాడీ కార్యకర్తలకు కూటమి నాయకులు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీతాలు పెంచకపోగా పనిభారం పెంచారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే సమాచారాన్ని రెండు యాప్‌ల్లో నమోదు చేయమనడంతో అంగన్‌వాడీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే బాలసంజీవని ద్వారా లబ్ధిదారులకు ఫేస్‌ యాప్‌ ద్వారా రేషన్‌ ఇస్తుండగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పోషణ ట్రాకర్‌ యాప్‌లో కూడా లబ్ధిదారుల ఫేస్‌ గుర్తింపు నిబంధనను తప్పనిసరి చేయడంతో కార్యకర్తలు రెండు యాప్‌లు నిర్వహించాల్సి వస్తోంది. ఆ యాప్‌ల గురించి ముందుగా శిక్షణ ఇప్పిస్తే ఫలితం ఉంటుంది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలతో పాటు 7–36 నెలల పిల్లలకు ప్రతి నెలా పోషకాహారాన్ని ఇంటికే అందిస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లల వివరాలను పోషణ యాప్‌, బాలసంజీవని యాప్‌లలో నమోదు చేయాల్సి వస్తోందని అంగన్‌వాడీ కార్యకర్తలు చెబుతున్నారు. టీహెచ్‌ఆర్‌(టేక్‌ హోమ్‌ రేషన్‌) అందించాలంటే ఒకే వ్యక్తిని రెండుసార్లు ముఖ యాప్‌ల ద్వారా గుర్తించాల్సి రావడం కూడా ఇబ్బందికరంగా మారినట్లు చెబుతున్నారు.

కార్యకర్తలు లబ్ధిదారులను అంగన్‌వాడీ కేంద్రాల వద్దకు పిలిపించుకుని పోషణ ట్రాకర్‌ యాప్‌లో ఫొటో అప్‌లోడ్‌ చేయాలి. వారికి ఇచ్చిన సరుకుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. ఈ సమయంలో సాంకేతికపరమైన ఇబ్బందులు వస్తున్నాయి. నెట్‌వర్క్‌ సరిగా రాకపోవడం, సెల్‌ఫోన్‌లు సరిగా పనిచేయకపోవడంతో ఈ ఫేస్‌ యాప్‌ ఓపెన్‌ కావడం లేదు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు గర్భిణులు, బాలింతలు గంటల తరబడి కేంద్రాల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. సమస్య తీరకుంటే మరోసారి కేంద్రం వద్దకు రావాల్సిందే. గతంలో సంతకాలు తీసుకుని సరుకులు ఇచ్చేవారని, ఈ ప్రభుత్వంలో ఆన్‌లైన్‌ విధానంలోనే పంపిణీ చేయాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నామని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరుకుల కోసం నాలుగైదు సార్లు కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోందని లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి నెలా రెండు సార్లు తిరగాలి..

బాలామృతం, బాలసంజీవని కిట్‌ల కోసం నెలలో మొదటి శుక్రవారం, మూడో శుక్రవారం గర్భిణులు, బాలింతలు టీహెచ్‌ఆర్‌ కోసం వెళ్లాలి. బియ్యం, కందిపప్పు, ఆయిల్‌, గుడ్లు, పాలు, బాలామృతం ప్యాకెట్‌ తెచ్చుకునేందుకు రెండుసార్లు వెళ్లిన సమయంలో యాప్‌లతో సమస్యలు తలెత్తుతున్నాయి. నాలుగేళ్ల క్రితం ఇచ్చిన సెల్‌ఫోన్‌లు, నెట్‌ వర్క్‌ పనిచేయకపోవడంతో ఐదారుసార్లు తిరగాల్సి వస్తోంది.

15 రకాల రికార్డులు నిర్వహించాలి..

అంగన్‌వాడీ కార్యకర్తలు ఆయా కేంద్రాల్లో 15 రకాల రికార్డులు నిర్వహించాల్సి వస్తోంది. దీని వల్ల చిన్నారుల ప్రాథమిక విద్యకు ఇబ్బందులు కలుగుతున్నాయని వాపోతున్నారు. ఇందులో లబ్ధిదారులకు అందించే ఆహార వినియోగం, పిల్లలు, గర్భిణిలు, బాలింతల వివరాల నమోదు రికార్డులు, ప్రీస్కూల్‌ అడ్మిషన్‌ రికార్డులను ప్రతి నిత్యం విధిగా నమోదు చేయాల్సిన పరిస్థితి. వాటితో పాటుగా పిల్లలకు అందించే టీకాలకు సంబంధించిన రికార్డుల రిజిస్టర్‌, విటమిన్‌–ఏ రికార్డు, రెఫరల్‌ సర్వీసెస్‌ గృహ సందర్శకుల రికార్డులు నిర్వహించాలి. దీంతో పాటు నెలవారీ ప్రాజెక్ట్‌, కేంద్రాల పరిధిలోని హౌస్‌ హోల్డ్‌ సర్వే, గ్రోత్‌ రికార్డు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సంబంధించిన రెండు టేక్‌ హోమ్‌ రేషన్‌ పంపిణీ రికార్డు నిర్వహించాల్సి వస్తోంది.

జిల్లాలో అంగన్‌వాడీ సెంటర్లు 2,903

అంగన్‌వాడీ వర్కర్‌లు 2,853

గర్భిణులు 9,723

బాలింతలు 6,201

ప్రీస్కూల్‌ పిల్లలు 38,309

పోషణ ట్రాకర్‌ ద్వారానే సరుకులు ఇవ్వాలని కేంద్రం నిబంధన ఫేస్‌ యాప్‌లు సరిగా పనిచేయక అవస్థల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు పౌష్టికాహారం పంపిణీలో ఇక్కట్లు నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్‌వాడీలు

ఒకే యాప్‌ విధానాన్ని తీసుకురావాలి

ప్రతిరోజు అంగన్‌వాడీ కార్యకర్తలు రెండు యాప్‌ల్లో వివరాలు నమోదు చేయాల్సి వస్తోంది. ఒకే సమాచారాన్ని రెండు యాప్‌ల్లో నమోదు చేయడం వల్ల సమయం వృథా అవుతోంది. సర్వర్‌, నెట్‌వర్క్‌ సమస్యలు వచ్చినప్పుడు గంటల తరబడి లబ్ధిదారులు వేచిఉండాల్సిన పరిస్థితి. సమయమంతా ఆయా యాప్‌ల్లో వివరాల నమోదుకే సరిపోతోంది. అంగన్‌వాడీలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జీతాలు పెంచాలి.

– సరళాదేవి, అంగన్‌వాడీ యూనియన్‌ నియోజకవర్గ అధ్యక్షురాలు

ఎఫ్‌ఆర్‌ఎస్‌తో ముప్పుతిప్పలు1
1/2

ఎఫ్‌ఆర్‌ఎస్‌తో ముప్పుతిప్పలు

ఎఫ్‌ఆర్‌ఎస్‌తో ముప్పుతిప్పలు2
2/2

ఎఫ్‌ఆర్‌ఎస్‌తో ముప్పుతిప్పలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement