
14 ఏళ్ల నిరీక్షణకు తెర
● కొండపి పంచాయతీకి ఎన్నికల నోటిఫికేషన్
కొండపి: కొండపి పంచాయతీ ఎన్నికల కోసం దాదాపు 14 సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని కొండపి పంచాయతీకి ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదల చేసినట్లు ఎంపీడీవో రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 30వ తేదీ కొండపి పంచాయతీకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. అదే రోజు ఉదయం గం.10:30 నుంచి ఆగస్టు 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 2వ తేదీ ఉదయం 8 గంటల నుంచి, 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్క్రూట్నీ ప్రక్రియ జరుగుతుందని, నాలుగో తేదీ తిరస్కరణకు గురైన నామినేషన్ల జాబితా విడుదల, 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ, మూడు గంటల తర్వాత అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తామని తెలిపారు. ఎన్నిక అవసరమైతే 10వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఓట్లు లెక్కింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే గెలిచిన అభ్యర్థిని ప్రకటిస్తామని, రీపోలింగ్ అవసరమైతే 12వ తేదీ ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట వరకు నిర్వహించి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించి గెలిచిన అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు.
ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించండి
● ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు నంద కిశోర్
మార్కాపురం: డాక్టర్లు ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నందకిశోర్ స్థానిక వైద్యులకు సూచించారు. సోమవారం ఆయన మార్కాపురం ఐఎంఏ కార్యాలయాన్ని సందర్శించి డాక్టర్లతో మాట్లాడారు. సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని, ఇందుకోసం గ్రామాల్లో పట్టణాల్లో సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రత్యేక రోజుల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేయాలని తెలిపారు. మార్కాపురం చుట్టుపక్కల ఉన్న ఐఎంఏ బ్రాంచ్ సభ్యులతో మాట్లాడుతూ సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో ఐఎంఏ అద్యక్ష, కార్యదర్శులు డాక్టర్ వంశీకృష్ణ, ఫణీంద్రారెడ్డి, శివశంకర్, రాంబాబు, హర్ష, మాధవరావు, శరత్ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన ఎనిమిదో రౌండ్ పొగాకు కొనుగోళ్లు
కొండపి: స్థానిక పొగాకు వేలం కేంద్రంలో సోమవారంతో 8వ రౌండ్ పొగాకు కొనుగోలు ప్రక్రియ ముగిసింది. ఎనిమిదో రౌండ్ ప్రారంభం నుంచి రోజుకు సగటుగా 350 బేళ్లకు పైన తిరస్కరించారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రౌండ్ చివర దశకు చేరుకునేసరికి కామేపల్లి, పచ్చవ గ్రామాలకు చెందిన రైతుల బేళ్లను అధిక సంఖ్యలో తిరస్కరించడంతో వేలం ప్రక్రియ నిలిపేశారు. ధర తగ్గించైనా పొగాకు బేళ్లను కొనుగోలు చేయాలని వేలం ప్రక్రియను నిలిపేశారు. గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే బేళ్ల తిరస్కరణ పిడుగుపాటులా ఉంటోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 9వ రౌండ్ ప్రారంభం నుంచైనా పొగాకు రైతుకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
412 బేళ్లు తిరస్కరణ:
స్థానిక పొగాకు వేలం కేంద్రంలో సోమవారం నిర్వహించిన వేలంలో 412 బేళ్లు తిరస్కరణ గురైనట్లు వేలం నిర్వహణ అధికారి జి.సునీల్ కుమార్ తెలిపారు. క్లస్టర్ పరిధిలోని వెన్నూరు చిన్న వెంకన్నపాలెం గ్రామాలకు చెందిన రైతులు 911 బేళ్లను వేలానికి తీసుకొచ్చారు. అందులో 499 బేళ్లు కొనుగోలయ్యాయి. వ్యాపారులు వివిధ కారణాలతో 412 బేళ్లను తిరస్కరించారు. పొగాకు గరిష్ట ధర కేజీ రూ.281, కనిష్ట ధర రూ.159, సరాసరి ధర కేజీ రూ.232.76 గా నమోదైంది. వేలంలో 27 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. సోమవారం నిర్వహించిన వేలాన్ని పొగాకు బోర్డు వైస్ చైర్మన్ బొడ్డపాటి బ్రహ్మయ్య సందర్శించారు.

14 ఏళ్ల నిరీక్షణకు తెర